కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో స్క్రాప్ దందా వెలుగుచూసింది. లక్షల రూపాయల విలువైన స్క్రాప్‌ను వేలం వేసి నగరపాలకసంస్థకు ఆదాయం తీసుకురావాల్సి ఉండగా, అడ్డదారుల్లో ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తున్నాయి. కొంతమంది అధికారులు ప్రైవేట్‌వాళ్లతో కుమ్మక్కు కావడం వల్ల నే స్క్రాప్ దందా చోటుచేసుకొంటున్నట్లు ఆరోపణలున్నాయి. వేలం వేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. నగరవ్యాప్తంగా సేకరించిన చెత్తాచెదారం, ఇతరత్రా స్క్రాప్ డంప్‌యార్డ్‌లోకి వస్తుండడం తెలిసిందే. ఇందులో ముందుగానే తడి, పొడి చెత్తను వేర్వేరుగా తీసుకొని, పొడి చెత్తను డీఆర్‌సీ సెంటర్‌కు, తడిచెత్తను కంపోస్ట్‌కు వినియోగిస్తారు. తద్వారా డంప్‌యార్డ్‌కు చెత్తను తగ్గించాలనేది అధికారుల ఆలోచన. అయితే పూర్తిస్థాయిలో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించకపోవడం కారణంగా, డీఆర్‌సీ, కంపోస్ట్‌ల ద్వారా డంప్‌యార్డ్‌కు వెళ్లే చెత్త అనుకున్న మేర తగ్గడం లేదు. ఇదిలా ఉంటే రెండు రోజులుగా డంప్‌యార్డ్‌లో ఉన్న వివిధ మిషనరీల, వాహనాల స్క్రాప్‌ను హౌసింగ్‌బోర్డుకాలనీ సమీపంలో ఉన్న డీఆర్‌సీ సెంటర్‌కు తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నగరపాలకసంస్థకు సంబంధించిన స్క్రాప్‌ను నిబంధనల ప్రకారం వేలం వేయాల్సి ఉంటుంది. వేలం వేయడానికి బదులు డంప్‌యార్డ్ నుంచి ప్రైవేట్ ఏజెన్సీ చేతిలో ఉండే డీఆర్‌సీ సెంటర్‌కు తీసుకురావడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల విలువైన ఈ స్క్రాప్‌ను వేలం ద్వారా విక్రయించాలని ఉన్నతాధికారులు ఓ వైపు ఆదేశించినా, కొంతమంది తమ చేతి వాటాన్ని ప్రదర్శించేందుకు ఇలా ప్రక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరపాలకసంస్థ అధికారులు మాత్రం స్క్రాప్‌ను వేలం వేస్తామని, ప్రైవేట్‌కు అప్పగించేది లేదని చెబుతున్నారు.


