కలెక్టర్ మేడంపై ఆశలు
అన్ని శాఖల్లో అటకెక్కిన సిటిజన్ చార్టర్
కలెక్టర్ క్యాంపు కార్యాలయం ప్రక్షాళన జరిగేనా?
కొత్త కలెక్టర్ దృష్టి సారించేనా!
కొత్త కలెక్టర్ చిత్రా మిశ్రాకు సమస్యల సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. పరిపాలనలో జవాబుదారితనం, పారదర్శకతే తన లక్ష్యమని సోమవారం జరిగిన ప్రజావాణిలో చెప్పకనే చెప్పారు. పాలనను గాడిన పెట్టడంతో పాటు పెండింగ్ పనులపై దృష్టిసారించాల్సిన అవసరముంది. పరిపాలన కేంద్రం కలెక్టరేట్‌తో పాటు కలెక్టర్ క్యాంపు కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం పూర్తి, జాతీయ రహదారులకు భూ సేకరణ, రైల్వే ట్రాక్ వద్ద ఫ్‌లైఓవర్ పనులు, కార్యాలయాల్లో పౌరసేవల పట్టిక ప్రకారం పనులు వంటి తదితర సమస్యలపై యుద్ధప్రతిపాదికన చర్యలు అవసరమని ప్రజలు కోరుతున్నారు.
కరీంనగర్ అర్బన్
కలెక్టర్ క్యాంపు కార్యాలయం సిబ్బందిలో దశాబ్దానికి పైగా సేవలందిస్తున్నవారుండటం విశేషం. నాన్‌గెజిటెడ్ అధికారులుగా ఉన్న సమయంలో సీసీలుగా బాధ్యతలు చేపట్టగా గెజిటెడ్ అధికారులు అయినా అదే పోస్టుకు ప్రాధాన్యం ఇస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో గిర్దావర్, సీనియర్ అసిస్టెంట్‌స్థాయి అధికారులు సీసీలుగా వ్యవహరించేవారు. కలెక్టర్ బదిలీ కాగానే కొత్తగా వచ్చే కలెక్టర్ కొత్తవారిని నియమించేవారు. కలెక్టర్లు మారుతున్నా పాతవారే సీసీలుగా, కార్యాలయ అధికారులుగా, సిబ్బందిగా విధులు నిర్వహించడం ఆరోపణలకు తావిస్తోంది.
కలెక్టరేట్‌లో ఫెవికాల్ విధులు
ఉద్యోగ జీవితంలో బదిలీలు తప్పనిసరి. కలెక్టరేట్‌లో మాత్రం ఫెవికాల్ అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండటం విశేషం. కలెక్టరేట్ ప్రధాన విభాగంతో పాటు సివిల్ సప్లయ్, సంక్షేమశాఖల్లో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నవారున్నారు. ప్రధానంగా రెవెన్యూశాఖలో పదుల సంఖ్యలో ఉద్యోగులు, అధికారులు కలెక్టరేట్‌కే పరిమితమయ్యారు. బదిలీ జరిగినా పైరవీలతో కుర్చీ వీడడం లేదు. కారుణ్య పద్ధతిలో నియామకమై టైపిస్ట్/జూనియర్ అసిస్టెంట్‌గా ప్రస్థానం మొదలై తహసీల్దార్‌గా పదోన్నతి పొందినా కలెక్టరేట్‌ను వీడడం లేదు. తప్పనిసరైతే కలెక్టరేట్‌లోని వేరేశాఖలకు బదిలీ చేసుకోవడం పరిపాటిగా సాగుతోంది.
కనిపించని సిటిజన్ చార్ట్
పదేళ్ల క్రితం వరకు దాదాపు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో పౌరసేవల పట్టిక దర్శనమిచ్చేది. ఒక్కో పనికి నిర్ణీత కాలవ్యవధి కనిపించేది. ప్రస్తుతం చాలా చోట్ల సదరు పట్టిక అటకెక్కించారు. భూ సమస్యలతో కలెక్టరేట్‌కు వస్తున్న రైతులకు అప్పటి సిబ్బంది చేసిన తప్పులే కారణం. ఇక కార్యాలయాల్లో దళారులే శాసించే పరిస్థితి పలు చోట్ల ఏర్పడింది.
సా..గుతున్న సమీకృత కలెక్టరేట్
గత ప్రభుత్వం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం పేరుతో నూతన కలెక్టరేట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. 2021లో అప్పటి బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రూ.51కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా పనులు నత్తను మరిపిస్తున్నాయి. వాస్తవానికి 2022 డిసెంబర్‌లోగా నిర్మాణ పనులు పూర్తవ్వాల్సి ఉండగా గుత్తేదారు నిర్లక్ష్యం అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి నూతన భవనం అందని ద్రాక్షగా మారింది.
ఇలా చేస్తే ప్రయోజనం
ఒక కార్యాలయంలో పనిచేసిన ఉద్యోగి, అధికారిని మళ్లీ సదరు కార్యాలయానికి బదిలీ చేయకూడదు. రెవెన్యూశాఖను గాడిన పెట్టేందుకు ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేయాలి. అప్పట్లో జేసీగా పనిచేసిన అరుణ్‌కుమార్ కలెక్టరేట్లో ఫిర్యాదుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలు నేరుగా సదరు నంబర్‌కు ఫిర్యాదు చేయడం, సంబంధిత సిబ్బంది వివరాలను నమోదు చేసుకుని గోప్యంగా ఉంచి ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. దీంతో సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకున్న ఘటనలున్నాయి. అతని బదిలీతో కేంద్రాన్ని ఎత్తివేశారు. గతంలో ప్రారంభించి వదిలేసినా ఈ–ఆఫీస్ సేవలను ముమ్మరం చేయాలి. రెవెన్యూ శాఖలోని ఉద్యోగులందరికీ విధులపై పునఃశ్చరణ తరగతులు నిర్వహించాలి. కుల, జనన, స్థానికత ధ్రువపత్రాలను జారీ చేసే బాధ్యతలను వీలైనంత వరకు తగ్గించాలి.


