వీణవంక మండలంలోని చల్లూరు–కోర్కల్ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఇటీవల ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. తల, కాళ్లకు గాయాలు కాగా.. రక్తస్రావమైంది. వాహనదారులు ప్రథమ చికిత్స చేద్దామంటే ఏ ఒక్క వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదు. కనీసం రక్తస్రావం అరికట్టేందుకు కాటన్ కూడా లేదు. దీంతో 20 నిమిషాలపాటు రక్తస్రావం జరిగింది. ఆసుపత్రికి తరలించగా.. చికిత్స కోసం 20 రోజుల సమయం పట్టింది. అదే వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటే ఎంతో కొంత ప్రయోజనముండేదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇది ఈ ఒక్క బాధితుడి పరిస్థితి కాదు.. వాహనాలు, పాఠశాలలు, సినిమా హాళ్లతోపాటు తదితర ముఖ్యమైన చోట్ల ఎక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కనిపించడం లేదు.
వీణవంక: ఫస్ట్ ఎయిడ్ బాక్స్(ప్రథమ చికిత్స) గురించి పాఠ్యాంశాల్లో చదివి ఉంటాం. ప్రథమ చికిత్స ప్రత్యేకత గురించి క్లుప్తంగా ప్రైమరీ పాఠ్యాంశాల్లో పొందుపర్చారు. అయితే దీని ఉపయోగం గురించి తెలియక చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాహనాలు, పాఠశాలలు, హోటళ్లు, సినిమా హాళ్లు తదితర జన సమూహముండే చోట ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలనే నిబంధన ఉంది. ముఖ్యంగా వాహనాల్లో ఈ బాక్స్ ఉండాలి. కొందరు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏర్పాటు చేసుకోకపోవడంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
ప్రథమ చికిత్స అంటే..
ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు తక్షణమే అందించాల్సిన వైద్యాన్ని ప్రథమ చికిత్స(ఫస్ట్ ఎయిడ్) అంటారు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే అత్యవసర సేవ 108కి ఫోన్ చేయాలి. 108 సిబ్బంది వచ్చేలోగా రక్తస్రావాన్ని ఆపేందుకు గాయంపై కాటన్‌తో బలంగా అదిమి ఉంచాలి. చిన్న గాయాలైతే కొద్దిసేపటికే రక్తస్రావం ఆగిపోతుంది. చికిత్స చేసే ముందు చేతికి గ్లౌజ్ వేసుకొని గాయంపై మట్టి, మురికి పోయేందుకు నీటితో కడగాలి. అనంతరం యాంటీ సెప్టిక్ లోషన్‌తో శుభ్రం చేసి కాటన్‌తో కట్టాలి. ఎక్కువ రక్తస్రావమయ్యే గాయాలను ఎట్టి పరిస్థితుల్లో నీటితో కడగొద్దు.
ఇవి చేయొద్దు..
ప్రమాదాలు రకరకాలుగా జరుగుతాయి. ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వెన్నుపూసకు బలమైన గాయమైతే ఆ వ్యక్తిని ప్రమాద స్థలంలో కదలించే ప్రయత్నం చేయొద్దు. కొందరు తెలియక కదలిస్తారు. దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. కాళ్లు, చేతులు, పక్కటెముకలు విరిగితే ఆ ప్రాంతంలో గట్టిగా అదిమి పట్టుకోవద్దు. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యమందించాలి.
ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో..
కిట్‌లో డ్రెస్సింగ్ కోసం ప్యాడ్లు, కత్తెర, బ్యాండేజీ, ఇన్‌ఫెక్షన్ సోకకుండా డెటాల్, హ్యాండ్ గ్లౌజులు, యాంటీసెప్టిక్ లోషన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఎక్స్‌ఫైర్ తేదీలు చూసుకొని ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. ఇవి ప్రతీ వాహనంలో, పాఠశాలలో భద్రపర్చుకుంటే మంచిది. గ్రామాల్లో ఎక్కువగా పాముకాటుకు గురవుతుంటారు. ఈ సమయంలో రైతులు తక్షణ చర్యలు చేపట్టాలి. విష పురుగు కాటు వేసిన ఫైభాగంలో గుడ్డతో గట్టిగా కట్టు కట్టాలి. వేడి నీరు, సబ్బుతో కడిగి యాంటీబయటిక్ లోషన్ రాయాలి. ఆసుపత్రికి తరలించాలి.


