కరీంనగర్ సిటీ: శ్రీరాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం ప్రాంగణ ఎంపిక నిర్వహించారు. హైదరాబాద్‌లోని గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాల ఎంపిక కోసం టీఎస్‌కేసీ సహకారంతో క్యాంపస్ డ్రైవ్ చేపట్టారు. రసాయన శాస్త్ర విభాగాధిపతి మేజర్ రేల్ల సంజీవ్, టీఎస్‌కేసీ కోఆర్డినేటర్ డాక్టర్ సుధాకర్, డ్రగ్ ఇండస్ట్రీ అధికారులు మన్మధరెడ్డి, డీవీపీ రాజ్‌కుమార్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ఔషధాల కంపెనీల్లో మంచి సదుపాయాలున్నాయన్నారు. విద్యార్థులకు రాత పరీక్ష, వివిధ దశల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. 18 మంది ఎంపికై నట్లు తెలిపారు. రసాయన శాస్త్ర ఉపన్యాసకులు పి.రాజేశ్, ఎ.శంకరయ్య, డాక్టర్ కె.సునీత, ఐ.గోపి, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
భక్తుల ఇళ్లకే భద్రాద్రి
రామయ్య తలంబ్రాలు
జగిత్యాలరూరల్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో జరిగే శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకే నేరుగా పంపిణీ చేయనున్నట్లు కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శివాజీ తెలిపారు. ఈనెల 27న జరగనున్న స్వామివారి కల్యాణానికి సంబంధించిన తలంబ్రాలను దేవాదాయ శాఖ సహకారంతో పోస్టల్ శాఖ భక్తులకు అందిస్తోందన్నారు. భద్రాచలం వెళ్లి స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేని భక్తులు.. తమ ఇళ్ల వద్దనే ఉంటూ తలంబ్రాలు పొందేందుకు వీలుగా కరీంనగర్ డివిజన్‌లోని అన్ని పోస్టాఫీసులలో బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. రూ.450 చెల్లించి ప్యాకేజీ బుక్ చేసుకున్న వారికి తలంబ్రాలతోపాటు ముత్యం, కుంకుమపువ్వు, పటికబెల్లం, జీడిపప్పు ప్రసాదంగా అందిస్తామని, రూ.151 చెల్లిస్తే ముత్యాల తలంబ్రాలు మాత్రమే అందుతాయని పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని ఈనెల 20లోపు సమీపంలోని పోస్టాఫీస్‌లో సంప్రదించి బుక్ చేసుకోవాలని సూచించారు. శ్రీరాముడిభక్తులంతా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పర్మిట్ రూంలపై
చర్యలు తీసుకోవాలి
కరీంనగర్‌క్రైం: నిబంధనలు ఉల్లంఘిస్తున్న పర్మిట్ రూంలపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ రెస్టారెంట్ అండ్ బార్స్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వైన్స్ సమీపంలో నిర్ణీత దూరంలో నిలబడి మద్యం సేవించే అనుమతి ఉండగా కుర్చీలు వేసి బార్‌ల మాదిరిగా నడిపిస్తున్నారని, తద్వారా తాము నష్టపోతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘం ప్రతినిధులు పొన్నాల తిరుపతి, మద్ది రమేశ్‌గౌడ్, గొట్టి ముక్కుల రవీందర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.


