సిటీలోని 1, 2 డివిజన్లలో నేడు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక ప్రారంభం
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి నగరంలో నిర్వహించనున్నారు. నగరపాలక సంస్థ 1, 2 డివిజన్ల పరిధిలోని హనుమాన్‌నగర్, చంద్రపురికాలనీల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా మొదటి పది రోజులపాటు పారిశుధ్య పనులు చేపట్టనున్నారు. ప్రతీరోజు ఆరు డివిజన్ల చొప్పున ఎంపిక చేసిన డివిజన్లలో పారిశుధ్యం మెరుగుపరుస్తారు. నగరపాలక సంస్థ కార్యాలయంతోపాటు కార్యాలయ ఆవరణలో పారిశుధ్య పనులు చేపడతారు. కార్యాలయంలోని అన్ని విభాగాల చాంబర్లు, పరిసర ప్రాంతాలను శుభ్రపరుస్తారు. అన్ని విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరిస్తారు. అనంతరం డివిజన్లవారీగా ప్రజల సమస్యలు పరిష్కరించడంతోపాటు అభివృద్ధి పనులు చేపడతారు.
సన్నాహక సమావేశం
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమ సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు. ప్రజలు, కార్పొరేటర్ల భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. 99 రోజుల కార్యక్రమం శుక్రవారం నుంచి జూన్ 12 వరకు కొనసాగుతుందని తెలిపారు. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. బర్త్, డెత్, ప్రాపర్టీ అసెస్‌మెంట్, ట్రేడ్ లైసెన్స్, ఇంటి అనుమతులు, నల్లా కనెక్షన్లు, మ్యుటేషన్ దరఖాస్తులు పరిష్కరించాలన్నారు.


