కరీంనగర్‌క్రైం: సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ విభాగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’లో భాగంగా కమిషనరేట్ పరిధిలో బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించిన మ్యూల్ అకౌంట్ దారులను గుర్తించినట్లు తెలిపారు. కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్‌లోని నాలుగు ప్రధాన బ్యాంకుల్లో మొత్తం 34 మ్యూల్ ఖాతాలను గుర్తించామని, ఎన్‌సీఆర్‌పీ పోర్టల్ ద్వారా ఇప్పటికే 162 వరకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు దాదాపు వెయ్యికి పైగా అక్రమ లావాదేవీలు చేసినట్లు తేలిందన్నారు. ఈ వ్యవహారంలో 20 కేసులు నమోదు చేయగా, నిందితులపై 112 బీఎన్‌ఎస్ ప్రకారం చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఏజెంట్లు ఆశజూపే కమీషన్ డబ్బుల కోసం బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్‌నంబర్లను అపరిచితులకు అందజేస్తున్నారన్నారు. తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇవ్వడం లేదా వివరాలు చెప్పడం నేరమని స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు, లేదా ఓటీపీ వివరాలు ఇతరులకు ఇవ్వవద్దని సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


