● సారంగాపూర్ పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదు
జగిత్యాలరూరల్: హోలీ సంబరాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన సిన్నోజు రమేశ్, జ్యోత్స్న దంపతుల కుమారుడు పవన్‌తేజ మంగళవారం హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కుటుంబసభ్యులు బుధవారం సారంగాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
● కెనాల్‌లో మునిగి యువకుడు మృతి
రామడుగు: రామడుగు మండలం దేశరాజ్‌పల్లిలో పండుగవేళ విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన యువకులు బుధవారం హోలీ జరుపుకుని శివారులోని మోతె వద్ద కాకతీయ కాలువలో స్నానాలకు వెళ్లారు. గ్రామానికి చెందిన వరాల అంజలి– రవికుమార్ కొడుకు రాకేశ్(24) కాలుజారి నీట మునిగి చనిపోయాడు. అక్కడే ఉన్న కొందరు రైతులు రాకేశ్ మృతదేహన్ని బయటకు తీశారు. రామడుగు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


