‘కళ’కు ఆదరణ కరువు | - | Sakshi
Sakshi News home page

‘కళ’కు ఆదరణ కరువు

Mar 5 2026 7:23 AM | Updated on Mar 5 2026 7:23 AM

ప్రభుత్వమే అండగా నిలవాలి

పెద్దపల్లిరూరల్‌: పౌరాణిక, నాటకరంగం, యక్షగానం, ఒగ్గుడోలు కళలకు ఆదరణ కరువైంది. తమకు వారసత్వంగా వచ్చిన కళలనే నమ్ముకున్న కళాకారులు ప్రస్తుతం నిరాదరణకు గురవుతున్నారు. పెద్దపల్లి మండలం హన్మంతునిపేటలో పౌరాణిక నాటక ప్రదర్శనలను బతికించేందుకు యువతకు శిక్షణ ఇస్తూ ఏటా చిడతల రామాయణం ప్రదర్శనలిస్తున్నారు. అలాగే రాఘవాపూర్‌ గ్రామానికి చెందిన ఒగ్గు, డోలు, చిందు కళాకారులు తెలంగాణలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో జరిగే వేడుకల్లోనూ ప్రదర్శనలిచ్చి ప్రముఖులతో మెప్పు పొందారు.

సులువుగా అర్థమయ్యేలా ప్రచారం

ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా కథలు, నాటకాల రూపంలో కళాకారులు అనేక ప్రదర్శనలిచ్చారు. అక్షరాస్యతతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూనే, ఎయిడ్స్‌ నిర్మూలన, మద్యం మహమ్మారితో కలిగే అనర్థాలను కళ్లకు కడుతున్నారు. సంక్షేమ పథకాల అమలుపై బృందాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. కళాకారుల పరిస్థితి దయనీయంగానే ఉంది. అధికారులు, పాలకులు ఎప్పుడోఓసారి ప్రదర్శనలు చేసే అవకాశం కల్పించి నామ్‌కేవాస్తేగా పారితోషికం అందించి చేతులు దులుపుకుంటున్నారని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆధునిక సాంకేతికతతోనే

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతోనే కళలు, కళాకారులకు ఆదరణ తగ్గుతోందని కళాకారులు వాపోతున్నారు. సీరియళ్లు, సినిమాలు ఇంట్లోనే వీక్షించే అవకాశాలు అందుబాటులో ఉండడం కూడా మరోకారణమంటున్నారు. పౌరాణిక, నాటకరంగం కనుమరుగయ్యే ప్రమాదంలో ఉందని, పాలకులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కళారంగాన్ని కాపాడాలని కోరుతున్నారు.

పట్నాలు వేసినప్పుడే ఉపాధి

ఏటా బీరన్న, మల్లన్న పట్నాలు వేసినప్పుడు నిర్వాహకులు ఇచ్చే కానుకలతోనే బతుకు వెళ్లదీయాల్సి వస్తోందని కళాకారులు తెలిపారు. గతంలో పల్లెల్లో.. అక్కడక్కడా పట్టణాల్లోనూ ఎవరైనా చనిపోతే కర్మకాండ నిర్వహించే రోజుల్లో రాత్రి నుంచి వేకువజాముదాకా ఒగ్గుకథ చెప్పించే వారని గుర్తు చేశారు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందని పేర్కొంటున్నారు. ఒగ్గుకథ చెప్పించే ఆనవాయితీ కనిపించడం లేదన్నారు.

దయనీయ స్థితిలో ‘పౌరాణికం’

కుటుంబ పోషణకు కష్టాలు

అర్హులకు పింఛన్‌ ఇవ్వాలని వేడుకోలు

పింఛన్‌ ఇప్పించాలి

ప్రభుత్వం అన్నివర్గాల్లోని అర్హులకు ఇస్తున్న మాదిరిగానే కళారంగంలో ప్రావీణ్యులైన వారిలో అర్హులను ఎంపిక చేసి పింఛన్‌ మంజూరు చేయాలని కోరుతున్నారు. జానపద, కళారంగాల కళాకారులతో పథకాలను ప్రచారం చేసేలా కార్యాచరణ రూపొందిస్తే తమకు ఉపాధి కల్పించినట్లవుతుందని పేర్కొంటున్నారు. పల్లె ప్రాంతాల్లో కళలనే నమ్ముకుని ఉన్నఎందరో కళాకారులు పొట్టకూటి కోసం, కుటుంబపోషణ భారం కావడంతో ఇతర పనుల వైపు దృష్టిసారించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్న పౌరాణిక, నాటక, జానపద కళారంగాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఆధునిక పోకడలతో కళారంగానికి ఆదరణ కరువైంది. కళాకారులతో సంక్షేమ పథకాలు, మూఢనమ్మకాలనిర్మూలనతోపాటు డ్రగ్స్‌, గంజాయితో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించే అవకాశాలను కళాకారులకు ఇప్పించాలి. అర్హులకు పింఛన్‌ మంజూరుచేసి అండగా నిలవాలి.

– కుంట సదయ్య, అధ్యక్షుడు, జిల్లా కళాకారుల సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement