వేములవాడఅర్బన్/వీర్నపల్లి(సిరిసిల్ల): స్థానిక ఓ లాడ్జీలో బుధవారం ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపిన వివరాలు. వీర్నపల్లి మండలం లాల్‌సింగ్‌తండాకు చెందిన భూక్య మోహన్(26) ఓ యువతితో కలిసి వేములవాడలోని ఓ ప్రైవేట్ లాడ్జీలోని అద్దె గదిలో దిగాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానంతో నిర్వాహకులు గది తలుపులు తెరిచి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. మృతుని బంధువల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లాడ్జీలో సీసీ కెమెరాలు లేకపోవడంతో సమీప భవనంలోని సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. మోహన్‌తో కలిసి వచ్చిన యువతి తిరిగి బయటకు వెళ్లినట్లు సమీపంలోని సీసీ పుటేజీలలో లేదు. అయితే మోహన్ మృతిచెందిన విషయం తెలిసిన తర్వాత మరో జంట అక్కడి నుంచి బయటకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
శతాధిక వృద్ధుడు..
ఇబ్రహీంపట్నం: మండలకేంద్రానికి చెందిన కంతిల్యాడ లింగన్న (105) బుధవారం మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వృద్ధాప్యం పైబడడంతో తుది శ్వాస విడించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల వరకు ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి..
కరీంనగర్‌రూరల్: ఆరెపల్లి శివారులోని సత్తినేని తిరుపతి పత్తి చేనులో బుధవారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతిచెందాడని కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.మృతుడి వయస్సు సుమారు 60 సంవత్సరాలు ఉంటుందని, తెల్లని గడ్డంతోపాటు తెల్లని బనియన్, ప్యాంటు ధరించి ఉన్నాడని వివరించారు. ఆచూకీ తెలిసినట్లయితే ఫోన్‌నంబరు 8712670764కు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.
బైక్ అదుపుతప్పి ఒకరు..
మల్యాల: బైక్ అదుపు తప్పి ఒకరు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ముక్కెర నరేశ్(26) ఈనెల 3న తన ద్విచక్ర వాహనంపై కొడిమ్యాల మండలంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మల్యాల మండలం గొర్రెగుండం శివారులో బైక్ అదుపుతప్పి, కిందపడి మృతిచెందాడు. నరేశ్ తండ్రి చిన్నపోచయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


