ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి శివారులో మంగళవారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన యాదగిరి పరిస్థితి విషమంగా ఉంది. ద్విచక్రవాహనం పూర్తిగా దగ్ధమైంది. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎస్సై రాహుల్‌రెడ్డి సందర్శించారు. వారు తెలిపిన వివరాలు.. కోనరావుపేట మండలం చిన్నబోనాలకు చెందిన రాగుల యాదగిరి– శంకరమ్మ దంపతులు టీవీఎస్‌ఎక్సెల్ ద్విచక్రవాహనంపై ఎల్లారెడ్డిపేట మండలం ధూమాలలో ఉంటున్న బంధువుల ఇంటికి ఉదయం వచ్చారు. బంధువులను కలిసి తిరిగి వెళ్తున్న క్రమంలో సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపు వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంపై ప్రయాణిస్తున్న దంపతులు దూరంగా ఎగిరిపడ్డారు. ద్విచక్రవాహనం నుంచి పెట్రోల్ లీకయి మంటలు ఎగిసిపడి పూర్తిగా కాలిపోయింది. గాయపడిన దంపతులను పోలీసులు 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన దంపతులు
వృద్ధ దంపతులకు తీవ్రగాయాలు
మంటల్లో కాలిపోయిన ద్విచక్రవాహనం


