ఉన్నట్టా.. లేనట్టా? | - | Sakshi
Sakshi News home page

ఉన్నట్టా.. లేనట్టా?

Mar 4 2026 7:25 AM | Updated on Mar 4 2026 7:25 AM

దివ్యాంగుల పార్కుపై సందిగ్ధం

రూ.4 కోట్లతో బల్దియా ప్రతిపాదనలు

తరువాత సాధ్యం కాదని పక్కనబెట్టిన అధికారులు

ఆ నిధులు సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి మళ్లింపు

డిజేబిలిటీస్‌ చీఫ్‌ కమిషనర్‌కు నగరవాసుల ఫిర్యాదు

15 రోజుల్లో ప్రాజెక్టు స్థితి తెలపాలని సీసీపీడీ కోర్టు ఆదేశం

దివ్యాంగుల పార్కుపై సందిగ్ధం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

గరంలో దివ్యాంగుల కోసం నిర్మించతలపెట్టిన పార్కు సాధ్యం కాదనుకున్న అధికారులు ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నారు. పార్కు నిర్మాణం సాధ్యం కాదని తేల్చిన కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీకే) ఆ నిధులను మరో ప్రాజెక్టుకు మళ్లించే యత్నం చేసింది. ఈ విషయమై నగరవాసులు కోర్ట్‌ ఆఫ్‌ చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ పర్సన్‌ విత్‌ డిజేబిలిటీస్‌ (సీసీపీడీ), న్యూఢిల్లీకి ఫిర్యాదులు చేశారు. విచారణ చేపట్టిన సీసీపీడీ ప్రాజెక్టు ప్రస్తుత స్థితిని గురించి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో బల్దియా అధికారులు తాము చేసిన పొరపాటును సరిచేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

అసలేం జరిగింది?

2021లో బల్దియాలో 10వ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల మీటింగ్‌ జరిగింది. ఆ సమావేశంలో రూ.4 కోట్లతో కరీంనగర్‌లో స్పెషల్లీ ఏబుల్డ్‌ పార్క్‌ నిర్మించేందుకు పరిపాలన అనుమతులు జారీచేసి, టెండర్లను ఆహ్వానించారు. ఈ పనులను ఎస్‌ఆర్‌వీఎస్‌ ఇండస్ట్రీస్‌ అనే సంస్థ దక్కించుకుంది. అనంతరం ఎస్‌ఆర్‌వీఎస్‌ ఇండస్ట్రీస్‌ తన యంత్రాలు, లేబర్లను సైట్‌ మీదకు పంపారు. కేటాయించిన భూమిలో వివాదం తలెత్తడంతో టెండరు పొందిన ఏజెన్సీ కొన్ని నెలల పాటు పనులు చేపట్టలేకపోయింది. 14వ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల మీటింగ్‌ (తేదీ: 03.01.2023 రోజున)లో స్పెషల్లీ ఏబుల్డ్‌ పార్క్‌ ప్రాజెక్ట్‌ను జాబితా నుంచి తొలగించారు. ఆ పార్కు కోసం కేటాయించిన నిధులను స్మార్ట్‌సిటీ ఫేస్‌–2 రోడ్లు, బుల్‌ సెమెన్‌ సెంటర్‌లో సమీకృత మార్కెట్‌ నిర్మించేందుకు బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల మీటింగ్‌లో ఆమోదించారు.

సీసీపీడీకి ఫిర్యాదు

బల్దియా అధికారుల తీరు సరికాదని పలువురు సామాజిక కార్యకర్తలు తప్పుబట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం సదుపాయాలు కల్పిస్తుంటే.. కరీంనగర్‌ స్మార్ట్‌సిటీలో భాగంగా స్పెషల్లీ ఏబుల్డ్‌ పార్క్‌ నిర్మాణం కోసం కేటాయించిన నిధులు మళ్లించడం దివ్యాంగుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని కోర్ట్‌ ఆఫ్‌ చీఫ్‌ కమిషనర్‌ పర్సన్‌ విత్‌ డిజేబిలిటీస్‌, న్యూఢిల్లీ(సీసీపీడీ)కి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు 12.09.2025 రోజున వీడియొ కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణ చేపట్టింది.

డ్రాప్‌ చేశారట.. క్యాన్సిల్‌ కాదట

విచారణలో భాగంగా తాము డిజేబిలిటీ పార్క్‌ ప్రాజెక్ట్‌ను డ్రాప్‌ చేశాం కానీ క్యాన్సిల్‌ చేయలేదని కొత్త స్థలం కోసం అన్వేషిస్తున్నాం అంటూ సమాధానమిచ్చారు. బల్దియా అధికారుల వివరణపై సంతృప్తి చెందని సీసీపీడీ 15 రోజుల్లో డిజేబిలిటీ పార్క్‌ ప్రాజెక్ట్‌ ప్రస్తుత స్థితిని తమకు తెలియచేయాల్సిందిగా ప్రభుత్వాన్ని, స్మార్ట్‌ సిటీ మేనేజింగ్‌ డైరెక్టర్లను గత ఫిబ్రవరి 25వ తేదీన ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు సీసీపీడీకి ఏం సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement