కరీంనగర్‌రూరల్: కేంద్ర ప్రభుత్వం వీబీ జీరామ్ జీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రవేశపెట్టి న ముఖ గుర్తింపు హాజరు విధానానికి ఆదిలోనే అడ్డంకులేర్పడ్డాయి. యాప్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో కూలీల ముఖ గుర్తింపు హాజరు నమో దు సాధ్యం కావడం లేదు. గతంలో కూలీల మస్టర్ విధానం అమలులో ఉండగా కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2నుంచి ముఖ గుర్తింపు హాజరు ప్రవేశపెట్టింది. సోమవారం నుంచి అధికారులు జిల్లాలో ప్రా రంభించారు. ఫీల్డ్‌అసిస్టెంట్లు ఉదయం, మధ్యాహ్నం కూలీల హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్త విధానంపై ఫీల్డ్‌అసిస్టెంట్లు, మేట్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఏర్పడుతున్నాయి.
యాప్‌లో సాంకేతిక సమస్యలు
వీబీ జీ రామ్ జీ(ఉపాధిహామీ) పథకంలో కూలీల హాజరు పక్కగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ ఆధార్ హాజరు విధానంలో సాంకేతిక సమస్యలేర్పడ్డాయి. మంగళవారం జిల్లాలోని పలు గ్రామాల్లో పనులకు వచ్చిన కూలీల హాజరును నమోదు చేసేందుకు ఫీల్డ్‌అసిస్టెంట్లు ప్రయత్నించగా యాప్‌లో కూలీల వివరాలు లభించలేదు. కొన్ని గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కొంతమంది కూలీల ఫొటోలు తీసుకోగా మరికొంతమంది కూలీల ఫొటోలు యాప్‌లో కన్పించకపోవడంతో ఫొటో తీయలేదు. మరి కొన్ని గ్రామాల్లో ఉదయం 8గంటలకు వచ్చిన కూలీలు గంటకుపైగా ఎదురుచూసినప్పటికీ యాప్ పనిచేయకపోవడంతో కూలీలు ఇంటికి వెనుతిరిగి వెళ్లిపోయారు. గతంలో కూలీల ఆధార్‌కార్డు నంబర్లను ఉపాధిహామీకి ఈ–కేవైసీ లింక్ చేసినప్పటికీ.. వివరాలు లభించకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒక్కో కూలీ ముఖ హాజరు నమోదు చేసేందుకు సుమారు 5నిమిషాల వరకు పడుతుండటంతో హాజరుకే సమయం సరిపోతుందని ఫీల్డ్‌అసిస్టెంట్లు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజులో సుమారు 70నుంచి 80మంది కూలీ ల ముఖ హాజరును రెండు పర్యాయాలు ఎలా నమోదు చేయాలో తెలియడంలేదని వాపోతున్నా రు. మంగళవారం జిల్లావ్యాప్తంగా 855 పనులు నడుస్తుండగా సుమారు 7వేల మంది కూలీలు పనులకు వచ్చారు. కేవలం 3,838 కూలీల ముఖ హాజరును నమోదు చేశారు. ప్రధానంగా చిగురుమామిడి, చొప్పదండి, కరీంనగర్, కొత్తపల్లి మండలాల్లో సాంకేతిక సమస్యతో కూలీల హాజరు తక్కువగా నమోదైంది. కొత్తగా అమలు చేస్తున్న యాప్ లో కొన్ని సాంకేతిక సమస్యలతో కూలీల హాజరు పూర్తిస్థాయిలో కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. రెండు,మూడు రోజుల్లో సాంకేతిక సమస్యలు పరిష్కరమయ్యే అవకాశముందన్నారు.


