హుజూరాబాద్: చిన్నప్పటి నుంచి వెండితెరపై మెరవాలన్నది ఆ యువకుడి కల. సినిమా రంగంపై ఉన్న మక్కువ, పట్టుదలతో శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు హుజూరాబాద్ పట్టణం విద్యానగర్‌కు చెందిన రాధారపు ప్రశాంత్. తాజాగా ఆయన హీరోగా నటించిన రవం చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో విడుదలకు సిద్ధమైంది. సైదాపూర్ మండలం జాగిరిపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ చిన్నతనం నుంచే సినిమాలపై ఎంతో ఆసక్తిని కనబరిచేవాడు. ఎలాగైనా నటుడిగా రాణించాలనే దృఢ సంక ల్పంతో ప్రయత్నాలు మొదలెట్టి చివరకు పాడాల తారక రామారావు నిర్మిస్తున్న రవం చిత్రంలో హీరోగా అవకాశం దక్కించుకున్నాడు. రామ్ మన్నార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా ప్రశాంత్ తన నటనా ప్రతిభను చాటుకోనున్నాడు.
సంబరాలు..
ఈనెల 6న రవం చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో.. హుజూరాబాద్‌లో పండుగ వాతావరణం నెలకొంది. తమ ప్రాంతానికి చెందిన యువకుడు హీరోగా పరిచయమవుతుండడంతో.. ప్రశాంత్ స్నేహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


