గొర్రెలకు సీసీ కెమెరా కాపలా
● దొంగల బెడదకు చెక్
● వలసబాటలో ప్రయోగాలు
సిరిసిల్ల: గొర్రెల మందలను దొంగల నుంచి రక్షించుకునేందుకు కాపరులు టెక్నాలజీని ఆశ్రయించారు. అనుభవాలే అన్ని నేర్పిస్తాయనేందుకు వీరే చక్కటి నిదర్శనం. పొద్దాంత మంద వద్ద ఉండే కాపరులకు రాత్రి వేళ వాటిని కాపాడుకోవడం సవాల్‌గా మారింది. రాత్రయితే పొలాల వద్ద మంద పెట్టే కాపరులకు దొంగల బెడద ప్రధాన సమస్యగా మారింది. ఒకప్పుడు పొలాల వద్ద మందపెట్టి ఇంటి వద్ద నిశ్చింతగా నిద్రపోయేవారు. కానీ ఇటీవల రాజన్నసిరిసిల్ల జిల్లాలో దొంగల బెడద తీవ్రం కావడంతో సీసీ కెమెరాలతో రక్షణను ఏర్పాటు చేస్తున్నారు. పెద్దగా చదువు రాకపోయినా రక్షణగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
వలసబాటలో రక్షణ ఏర్పాట్లు
కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన సందల్ల దేవయ్య, బీరయ్య, రాజయ్య సోదరులు చందుర్తి మండలం ఎన్గల్ శివారు పత్తిచేనుల్లో గొర్రెలను మేపేందుకు రెండు నెలల కిందట వలస వచ్చారు. మరో నెల రోజులపాటు ఎన్గల్ శివారులోనే గొర్రెలను మేపాల్సి ఉంటుంది. నిమ్మపల్లి శివారులో గొర్రెలకు మేత లేక వలస వచ్చారు. చందుర్తి, బోయినపల్లి, కోనరావుపేట మండలాల్లో గొర్రెల మందల వద్ద దొంగలు ఆటోల్లో వచ్చి గొర్రెలను ఎత్తుకెళ్లారు. ఇలాంటి ఘటనలతో గొర్రెలకాపరులకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతుంది. దీంతో గొర్రెల మందకు రక్షణగా రూ.10వేలు వెచ్చించి సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. రాత్రి వేళలోనూ సెల్‌ఫోన్‌లో స్పష్టంగా కనిపించడంతో గొర్రెలకాపరులు భరోసాతో ఉంటున్నారు. సీసీ కెమెరా సొలార్ ప్యానల్ ఉండడంతో ఎండకు చార్జి అవుతూ.. రాత్రి పనిచేస్తున్నాయి. రెండు నెలలుగా సీసీ కెమెరాల రక్షణలో గొర్రెలకాపరులు నిశ్చింతగా నిద్రిస్తున్నారు.
గతంలో రాత్రి పూట గొర్రెల మంద వద్దకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి 25 గొర్రెలు ఎత్తుకెళ్లారు. మాకు రూ.2.50 లక్షల నష్టం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా దొంగలు దొరకలేదు. దీంతో సీసీ కెమెరాను కొన్నాం. మా ముగ్గురి వద్ద సెల్‌ఫోన్‌కు అనుసంధానించాం. రాత్రి పూట కూడా మంద బాగా కనిపిస్తుంది. మేము కూడా ఇప్పుడు నిశ్చింతగా నిద్రపోతున్నాం. పెద్దగా ఖర్చు కూడా ఏమీ లేదు. సీసీ కెమెరాలతో రక్షణ బాగుంది.
– దేవయ్య, బీరయ్య, రాజయ్య, గొర్రెలకాపరులు, నిమ్మపల్లి
గొర్రెలకు సీసీ కెమెరా కాపలా
గొర్రెలకు సీసీ కెమెరా కాపలా


