దేవుడా.. మేమేం పాపం చేశాం..
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఆ దంపతులకు ముగ్గురు కుమారులు. వారిని చూసి తమకు కొండంత అండగా ఉంటారని మురిసిపోయారు. కానీ.. వారి కుటుంబాన్ని విధి వెక్కిరించింది. చేతికందిన ఇద్దరు కొడుకులు ఇరవై ఏళ్ల క్రితం వేర్వేరు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ తల్లిదండ్రులు ధైర్యం కోల్పోయారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. విధి మరోసారి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. ఉన్న ఆ ఒక్కగానొక్క కొడుకు కూడా గడ్డిమందు తాగి చనిపోవడంతో ‘దేవుడా మేమేం పాపం చేశాం.. మాకే ఎందుకీ పుత్రశోకం’ అంటూ గండెలవిసేలా రోదిస్తున్నారు. గ్రామస్తులు, పోలీసుల వివరాలు.. కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామ పంచాయతీ పరిధి జగ్గయ్యపల్లె గ్రామానికి చెందిన రెడ్డి రాంరెడ్డి, సుశీల దంపతులకు ముగ్గురు కుమారులు మహేందర్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి(39). ఇటీవల ట్రాక్టర్ కొనివ్వాలని తండ్రిని మధుసూదన్‌రెడ్డి అడిగాడు. ఇంటికోసం చేసిన అప్పులు తీరలేదు. ఇప్పుడే ట్రాక్టర్ వద్దని తండ్రి వారించాడు. మనస్తాపానికి గురైన మధుసూదన్‌రెడ్డి గత నెల 25న గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడికి భార్య పావని, కూతురు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్ పేర్కొన్నారు.
తల్లిదండ్రులకు పుత్రశోకం
వరంగల్ జిల్లా పరకాల సమీపంలోని కంఠాత్మకూర్ నుంచి రాంరెడ్డి చాలా ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ఆదిలాబాద్ జిల్లా కౌటాలకు వలస వెళ్లాడు. అక్కడ భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. సుమారు ఇరవై ఏళ్ల క్రితం ఇంటర్ ఫెయిల్ అయినందుకు పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత రెండో కుమారుడు మధుకర్‌రెడ్డి ఎంగేజ్‌మెంట్ అయ్యాక పెళ్లి క్యాన్సిల్ కావడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండు ఘటనలతో మనస్తాపానికి గురైన రాంరెడ్డి దంపతులు చిన్న కుమారుడు మధుసూదన్‌రెడ్డి అత్తగారిల్లయిన జగ్గయ్యపల్లెకు వచ్చారు. ఈనేపథ్యంలో తమకు ఆసరా ఉన్నాడని కొండంత ధైర్యంతో ఉన్న రాంరెడ్డి దంపతులకు చిన్న కొడుకు ఆత్మహత్యతో వారి రోదనలు మిన్నంటాయి. ‘ఈ పుత్ర శోకం మాకెందుకు ఇచ్చావు దేవుడా’ అంటూ ఆ వృద్ధ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం సాయంత్రం మధుసూదన్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.
ట్రాక్టర్ కొనొద్దని తండ్రి వారించినందుకు..
గడ్డిమందు తాగి అఘాయిత్యం
కన్నవారికి కడుపు కోత..
భార్యాపిల్లలకు తీరని వ్యథ
ఆ ఇంట్లో ముగ్గురూ బలవన్మరణం
దేవుడా.. మేమేం పాపం చేశాం..


