కోల్‌బెడ్‌ మిథేన్‌పై సింగరేణి నజర్‌! | - | Sakshi
Sakshi News home page

కోల్‌బెడ్‌ మిథేన్‌పై సింగరేణి నజర్‌!

Mar 1 2026 7:35 AM | Updated on Mar 1 2026 7:35 AM

కోల్‌బెడ్‌ మిథేన్‌పై సింగరేణి నజర్‌!

కోల్‌బెడ్‌ మిథేన్‌పై సింగరేణి నజర్‌!

ప్రధాన అవకాశాలున్న ప్రాంతాలు

19 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల మిథేన్‌ గ్యాస్‌

అన్వేషణకు వేలంలో పాల్గొనాలని కేంద్రం సూచన

నాలుగు ఏరియాల్లో గ్యాస్‌ లభ్యతపై దృష్టి

వేలం ద్వారా దక్కించుకునేందుకు కసరత్తు

సింగరేణి సీఎండీతో ఏడీజీ భేటీ

గోదావరిఖని(రామగుండం): బొగ్గు అన్వేషణలో 13 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు బొగ్గు పొరలలో ఉన్న మిథేన్‌ గ్యాస్‌ వనరుల అన్వేషణకు అవకాశం లభించనుంది. కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వ శాఖ సింగరేణి ప్రాంతంలో గుర్తించిన మూడు ప్రధాన బ్లాక్‌ల అన్వేషణలో పాల్గొనాల్సిందిగా ఆ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సింగరేణిని కోరారు. దేశవ్యాప్తంగా ఈ వాయువును ఉత్పత్తి చేయడానికి పలు రాష్ట్రాల్లో బ్లాక్‌లను గుర్తించారని, దీనిలో ప్రాణహిత–గోదావరి లోయ ప్రాంతం కూడా ఉందని, దీనికి సంబంధించి ముందుగా అన్వేషణ జరపడానికి త్వరలో కేంద్ర పెట్రోలియం శాఖ వేలం నిర్వహించబోతోంది. సింగరేణి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సింగరేణి ప్రాంతంలోని మంచిర్యాల, పెద్దపల్లి, కొమరమ్‌భీమ్‌ ఒక బ్లాక్‌, భద్రాద్రి కొత్తగూడెంలో ఒక బ్లాక్‌, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు కలిపి ఒక బ్లాక్‌గా గుర్తించారు. ఆయా బ్లాక్‌లలో దాదాపు 19 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల మిథేన్‌ గ్యాస్‌ వనరుల లభ్యత ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. వికసిత్‌ భారత్‌– 2047లో భాగంగా చమురు, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించడంలో అంతర్భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కోల్‌ బెడ్‌ మీథేన్‌ (సీబీఎం) బొగ్గు పొరల్లో సహజంగా ఉండే మీథేన్‌ గ్యాస్‌. భద్రతా కారణాల వల్ల ఇప్పటివరకు ప్రమాదకరంగా భావించిన ఈ గ్యాస్‌ను, సాంకేతిక పరిజ్ఞానంతో వాణిజ్యపరంగా ఉపయోగించుకునే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి.

గోదావరిలోయలో నిల్వలు

సింగరేణి కార్యకలాపాలు ప్రధానంగా గోదావరిలోయ బొగ్గు క్షేత్రాల్లో సాగుతున్నాయి. భూగర్భ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం లోతైన బొగ్గు పొరలున్న ప్రాంతాల్లో మీథేన్‌ నిల్వలు ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి.

మీథేన్‌ గ్యాస్‌ ప్రాధాన్యం?

శుభ్రమైన ఇంధనం బొగ్గుతో పోలిస్తే తక్కువ కాలుష్యం ఉంటుంది. విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగిస్తారు. పరిశ్రమలకు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగ పడుతుంది. సీఎన్‌జీ తరహా ఇంధనంగా వాడే అవకాశముంది. అండర్‌గ్రౌండ్‌ గనుల్లో ప్రమాదాలను తగ్గించే భద్రతాపరంగా ప్రయోజనం ఉంటుంది. ఇప్పటి వరకు గనుల్లో మీథేన్‌ ప్రమాదకర గ్యాస్‌గా భావించబడింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఇదే గ్యాస్‌ను శక్తి వనరుగా ఉపయోగిస్తున్నారు. సింగరేణి సంస్థకు సానుకూల అంశంగా మారే అవకాశాలున్నాయి.

సాంకేతిక– పరిపాలనా సవాళ్లు

మిథేన్‌ గ్యాస్‌ వెలికితీతకు సింగరేణి సంస్థకు ప్రత్యేక డ్రిల్లింగ్‌ సాంకేతికత అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ, పర్యావరణ అనుమతులు, భారీ పెట్టుబడులు అవసరం ఉంటాయి. గ్యాస్‌ నిల్వల కచ్చిత అంచనా కోసం జియోలాజికల్‌ సర్వేలుంటాయి.

తెలంగాణకు లాభాలేమిటి?

రాష్ట్రానికి కొత్త ఆదాయ వనరుగా ఉపయోగపడనుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. పరిశ్రమలకు తక్కువ ధరకు ఇంధనం లభించే అవకాశం ఉంది. శక్తి స్వావలంబనలో ఒక ముందడుగు పడనుంది.

మిథేన్‌గ్యాస్‌ అన్వేషణతో కొత్తశకం..

సింగరేణి సంస్థ ఇప్పటికే బొగ్గు ఉత్పత్తితో పాటు సోలార్‌, థర్మల్‌ విద్యుత్‌ రంగాల్లో ముందుకు సాగుతోంది. అంతేకాకుండా హైడల్‌, హైడ్రో విద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందిస్తోంది. సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తే, బొగ్గు ఆధారిత సంస్థ నుంచి బహుళశక్తి వనరుల సంస్థగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. సింగరేణిలో మిథేన్‌గ్యాస్‌ వెలికితీత ఒక సాంకేతిక సవాలు అయినా, సమర్థవంతమైన ప్రణాళికతో అమలు చేస్తే తెలంగాణకు ఇది శక్తి విప్లవానికి నాందికానుంది.

తెలంగాణలో గుర్తించిన మిథేన్‌గ్యాస్‌ 19బిలియన్‌ క్యూబిక్‌మీటర్లు

మంచిర్యాల, పెద్దపల్లి, కొమరమ్‌భీం జిల్లాల్లో: 5 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు

భద్రాద్రి కొత్తగూడెంలో ఒక బ్లాక్‌ : 2 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు

భద్రాద్రి కొత్తగూడెం, ములుగు కలిపి ఒక బ్లాక్‌: 12 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు

మణుగూరు– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

లోతైన బొగ్గు పొరలు, అధిక వాయు విడుదల చరిత్ర ఉన్న ప్రాంతం. అండర్‌గ్రౌండ్‌ గనుల్లో గ్యాస్‌ సాంద్రత ఎక్కువగా నమోదైన సందర్భాలు ఉన్నాయి.

కొత్తగూడెం బెల్ట్‌

పాత గనుల్లో గ్యాస్‌ నిల్వలు ఉండే అవకాశం. డీ–గ్యాసిఫికేషన్‌ ద్వారా గ్యాస్‌ను సురక్షితంగా వెలికితీయవచ్చు.

గోదావరిఖని– రామగుండం (పెద్దపల్లి జిల్లా)

లోతైన బొగ్గుగని నిర్మాణం, పెద్ద స్థాయి గనులు ఉండటంతో ప్రాజెక్టులకు అనుకూల వాతావరణం.

బెల్లంపల్లి– మంచిర్యాల ప్రాంతం

చారిత్రాత్మకంగా గ్యాస్‌ విడుదల ఎక్కువగా నమోదైన గనులు. అన్వేషణ జరిపితే వాణిజ్యపరంగా ఉపయోగకరమైన నిల్వలు బయటపడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement