నకిలీ నోట్ల చెలామణి ముఠా అరెస్టు
లక్సెట్టిపేట: నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను లక్సెట్టిపేట పోలీసులు అరెస్టు చేశారు. 12మందిని అదుపులోకి తీసుకుని, రూ.5,98,500, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం స్థానిక పోలీసుస్టేషన్‌లో మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, సీఐ రమణామూర్తి వివరాలు వెల్లడించారు. ఇటిక్యాలకు చెందిన కానిగంటి క్రాంతి, గడికొప్పుల రవీందర్, శ్రీరాంపూర్‌కు చెందిన తాండ్ర ప్రకాశ్, వెంకట్రావుపేటకు చెందిన కోన మధుకర్, గోదావరిఖనికి చెందిన సుంక సురేశ్, సుల్తానాబాద్‌కు చెందిన కమాని అనిల్, రంగపేటకు చెందిన బండారి సత్యనారాయణ, లక్సెట్టిపేటకు చెందిన రామునాయక్, జెండావెంకటాపూర్‌కు చెందిన కందిమల్ల తిరుపతి, ధర్మారం మండలం పెరికపల్లికి చెందిన కుమారస్వామి, పట్టణంలోని మోదెల రోడ్‌కు చెందిన నగునూరి రాము, సిద్దిపేట జిల్లా బెజ్జంకికి చెందిన దేవనబోయిన సంపత్‌కుమార్ ముఠాగా ఏర్పడ్డారు. కాకినాడకు చెందిన రాము, రవి నుంచి నకిలీ నోట్లు తీసుకొచ్చి మండలంలోని పలు ప్రదేశాల్లో చెలామణి చేస్తున్నారు. ఫిబ్రవరి 25న ఇటిక్యాల వద్ద ఉన్న పెట్రోల్‌బంక్‌కు కొందరు కారులో వచ్చి రూ.1500 ఇచ్చి పెట్రోల్ పోయించుకుని వెళ్లారు. నకిలీ నోట్లుగా గుర్తించిన పెట్రోల్‌బంక్ సిబ్బంది పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. శనివారం ఇటిక్యాల గ్రామ స్టేజీ వద్ద వాహన తనిఖీలు చేపట్టి కారులో వెళ్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా 12మందిని అరెస్టు చేసి నగదు, కార్లు, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. రాము, రవి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు ఛేదించిన స్థానిక ఎస్సై గోపతి సురేశ్, కానిస్టేబుళ్లను అభినందించారు.
రూ.5,98,500, మూడు కార్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్


