ప్రమాదమా..హత్యా ?
ముస్తాబాద్(సిరిసిల్ల): అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటనపై పలు అనుమానాలు కలుగుతున్నయి. ప్రమాదమా లేక ప్రణాళిక ప్రకారమే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. యువకుడి మృతికి కారకులను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్‌కు చెందిన బొమ్మెన చందు(22) ఫిబ్రవరి 22న అర్ధరాత్రి గూడెంలో జరిగిన పెండ్లి బబరాత్‌కు వెళ్లాడు. బైక్‌పై తిరిగి ఇంటికెళ్తుండగా చందును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే చందు మృతిచెందాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు తెలిసినట్లు సమాచారం. సీఐ మొగిలి ఆధ్వర్యంలో చేపట్టిన విచారణలో ముస్తాబాద్‌కు చెందిన ఆటో చందును ఢీకొట్టినట్లు గుర్తించారు. బైక్‌పై ఉన్న చందును ప్రమాదవశాత్తు ఢీకొట్టిన అనంతరం.. మరోసారి చందును ఆటోతో ఢీకొట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆటోలో ఉన్న నిందితులకు ఇప్పటికే పలు నేరాలతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ కోణంలో కూపీ లాగుతున్నట్లు సమాచారం. ఒక్కాగానొక్క కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఎల్లం, అనితలు కొడుకు చందు జ్ఞాపకాలతో తల్లడిల్లుతున్నారు. ఈ విషయంపై సీఐ మొగిలి మాట్లాడుతూ విచారణ కొనసాగుతోందని త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిపై పోలీసుల ఆరా
పోలీసుల అదుపులో నిందితులు?


