భరోసా.. నిరాశ!
యాసంగి నాట్లు పూర్తి
అయినా అందని పెట్టుబడి సాయం
సాగు వివరాలు అందించిన వ్యవసాయ శాఖ
జిల్లాలో 1.90లక్షల మంది రైతుల నిరీక్షణ
కరీంనగర్ అర్బన్: యాసంగి సీజన్ మొదలై రెండు నెలలు అవుతున్నా.. రైతులకు ‘రైతు భరోసా’ అందడం లేదు. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు రైతు భరోసా జమ కాలేదు. అప్పోసప్పో చేసి వరి నాట్లు పూర్తి చేసిన రైతులు.. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కోసం చూస్తున్నారు.
జిల్లాలో పంట సాగు వివరాలు
జిల్లాలో యాసంగి సీజన్‌లో 2,65,389 ఎకరాల్లో వరి పంటను, 30వేల ఎకరాల్లో మక్కను సాగు చేయగా ఇతర పంటలు 5వేల ఎకరాల్లో సాగు చేశారు. రైతులు ఎరువుల కొనుగోలు, విత్తనాల కొనుగోళ్లు, ట్రాక్టర్‌తో దున్నకాలకు, వ్యవసాయ కూలీల కై కిళ్లు ఇలా ఎకరానికి సగటున రూ.15వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వం ఎకరానికి రూ.6 వేలు అందిస్తుండగా.. ఈ సొమ్ము ఉపయోపడుతుంది. ప్రభుత్వం ఇచ్చే ‘రైతు భరోసా’ కోసం రైతులు రెండు నెలలుగా నిరీక్షిస్తున్నారు.
శాటిలైట్ సర్వేల ఆధారంగా
సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సాటిలైట్ సర్వేలు చేసింది. సర్వే నంబర్ల వారీగా రైతుల వివరాలను నమోదు చేస్తూ అక్షాంశ, రేశాంశాల ఆధారంగా సర్వేలు పూర్తి చేశారు. సాగు చేసిన భూముల వివరాలను వ్యవసాయశాఖ ఆన్‌లైన్‌లో నమోదు చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సాగు చేయని, పడావులుగా ఉన్న, బీడు భూములకు కూడా రైతుబంధు సాయంగా ఎకరానికి ఏటా రూ.10వేలు ఇచ్చి ప్రజాధనాన్ని వృథా చేసిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంటూ ఈ సర్వేలు చేయించారు. రబీ సీజన్ మొదలై రెండు నెలలు పూర్తి అవుతున్నా.. రైతు భరోసా జాడ లేదు.
హామీ.. నెరవేరదేమీ..!
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ‘రైతు భరోసా’ పథకంలో ఏటా ఎకరానికి రూ.15వేలు ఇస్తామని ఆరు గ్యారంటీల్లో హామీ ఇచ్చారు. కానీ అది అమలు కావడంలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏటా రూ.10వేలు పంట కాలానికి అనుగుణంగా పసల్‌కు ఎకరాకు రూ.5వేల చొప్పున అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీని అమలు చేయకుండా.. ఏటా ఎకరానికి రూ.12వేలు ఇస్తోంది. అది కూడా ఈ రబీ సీజన్‌లో ఆలస్యం అయింది. ఈ సీజన్‌కు ఎకరానికి రైతు భరోసాగా వచ్చే రూ.6వేల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. వెంటనే ప్రభుత్వం రైతు భరోసా అందించాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
భరోసాపై సీఎంకు కేంద్రమంత్రి లేఖ
రైతు భరోసాపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ శుక్రవారం ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. యాసంగి సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటినా రైతు భరోసా విడుదల చేయకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, తరువాత మాట తప్పడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల మందికి పైగా రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం తప్పదని స్పష్టం చేశారు.


