హెచ్‌పీవీ వ్యాక్సిన్‌కు శ్రీకారం
కరీంనగర్: దేశంలో మహిళలను వేధిస్తున్న గర్భాశయ ముఖద్వార కేన్సర్ (సర్వికల్ క్యాన్సర్) సహా పలు కేన్సర్లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేన్సర్‌ను తరిమేందుకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) నిరోధక టీకాను దేశవ్యాప్తంగా అందుబాటలోకి తేవాలని నిర్ణయించగా.. శనివారం నుంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. 14–15 ఏళ్ల వయసు గల బాలికలకు ఈ టీకాను అందించనున్నారు. హెచ్‌పీవీ టీకా గురించి తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరం.
హెచ్‌పీవీ టీకా ప్రయోజనాలు
హెచ్‌పీవీ వైరస్‌తో గర్భాశయ ముఖద్వార కేన్సర్ ఎక్కువగా వస్తుంది. ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ఆలస్యంగా గు ర్తించే అవకాశాలు ఉంటాయి. టీకా ద్వారా వైరస్ సంక్రమణ ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. వైద్య నిపుణుల వివరాల ప్రకారం 9– 14 ఏళ్ల మధ్య వయస్సులో టీకా వేయడం వల్ల అత్యంత ప్రభావవంతంగా పనిచేయనుంది. ఈ టీకాను కేంద్ర ప్రభుత్వం జాతీ య టీకా కార్యక్రమంలో దశలవారీగా చేర్చుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల ద్వారా బాలికలకు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసి అమలు విధానాన్ని ఖరారు చేస్తోంది.
జిల్లాలో ఖరారు కాని కార్యాచరణ
జిల్లాలో హెచ్‌పీవీ టీకా కార్యక్రమంపై ఇంకా స్పష్టమైన కార్యాచరణ రూపొందలేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. టీకాల సరఫరా ఇంకా జరగలేదు. సరఫరా తేదీలపై కూడా ఇప్పటి వరకు స్పష్టం లేదు. ఇప్పటి వరకు 11 వేల మంది బాలికల జాబితా తయారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. పాఠశాలల సమన్వయం వంటి అంశాలపై త్వరలో మార్గదర్శకాలు అందుతాయని తెలిపారు. జిల్లాలో కార్యక్రమం ప్రారంభ తేదీపై త్వరలో స్పష్టత రానుంది.


