● రోడ్డుపైనే వ్యాపారాలు ● ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు
అమరవీరుల స్తూపం ఎదుట ఆక్రమణలతో ఇరుకుగా రోడ్డు
కరీంనగర్ కార్పొరేషన్: రోడ్డు ఆక్రమణల తొలగింపు మున్నాళ్ల ముచ్చటగా మారింది. నగరంలో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం కలిగిస్తున్న రోడ్డు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై బల్దియా అధికారులు చర్యలకు పూనుకుంటున్నా, కొద్ది రోజుల్లోనే పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. ఫలితంగా ఆక్రమణల తొలగింపు నగరంలో ప్రహసనంగా మారింది. నగరం విస్తరిస్తుండగా, ట్రాఫిక్ సమస్యలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ఫుట్‌పాత్‌లు, రోడ్లు ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తుండడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. ముఖ్యంగా టవర్‌సర్కిల్, రాజీవ్‌చౌక్, తెలంగాణచౌక్ తదితర రద్దీ ప్రాంతాల్లో ఆక్రమణలు అధికంగా ఉంటున్నాయి. నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ గతంలో ఫుట్‌పాత్, రోడ్ల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించారు. ఆ తరువాత కొద్దిరోజులకే మళ్లీ ఆక్రమణలు ప్రత్యక్షమవుతుండడంతో, స్పెషల్ డ్రైవ్‌ను నిరంతర ప్రక్రియగా మార్చారు. ఇటీవల బల్దియా ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆక్రమణల తొలగింపుపై దృష్టిపెట్టలేకపోయారు. ఇదే అదనుగా నగరంలో మళ్లీ ఫుట్‌పాత్, రోడ్డు ఆక్రమణలు భారీగా పెరిగిపోయాయి.
ఆక్రమణల తొలగింపు వివాదం
నగరంలోని ఐడీఎస్‌ఎంటీ భవనం (పాత మున్సిపల్ గెస్ట్‌హౌస్) వద్ద రోడ్డు, పుట్‌పాత్‌లు ఆక్రమించి దుకాణాలు వెలుస్తుండడం తీవ్ర ఇబ్బందిగా మారింది. వాణిజ్య ప్రాంతం కావడంతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంపై రోడ్డుపైకి చొచ్చుకొని వచ్చి దుకాణాలు ఏర్పాటు చేసుకొంటున్నారు. దీంతో ఈ రోడ్డు గుండా వెళ్లేందుకు కార్లను పక్కనపెడితే, నడవడానికి ఇబ్బందికరంగా మారింది. గురువారం నగరపాలకసంస్థ డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఆక్రమణల తొలగించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఆక్రమణలు తొలగించకుండానే వెనుదిరిగినట్లు, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అయ్యాయి. కొత్త పాలకవర్గం కొలువుతీరిన కొద్దిరోజుల్లోనే ఫుట్‌పాత్, రోడ్ల ఆక్రమణల తొలగింపుపై రాజకీయ దుమారం చెలరేగడం బీజేపీ పాలకవర్గానికి సవాల్‌గా మారింది. నగరంలో ట్రాఫిక్‌కు సంబంధించి ప్రధాన సమస్యగా మారిన ఫుట్‌పాత్, రోడ్ల ఆక్రమణలపై నగరపాలకసంస్థ ప్రత్యేక దృష్టిపెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.
సార్ రూటే.. ఇల్లీగల్!
● రోడ్డుపైనే వ్యాపారాలు ● ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు


