● బోగస్ పంచనామా.. మామూళ్లే లక్ష్యం ● వసూళ్లలో ‘విజయ’సా
పని ఏదైనా పైసానే ప్రథమం
కరీంనగర్ అర్బన్: అతను కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, అసిఫాబాబాద్ కొమురంభీం, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు అధికారి. కరీంనగర్‌లో కార్యాలయం. ఎవరైనా కార్యాలయానికి వెళ్తే హిత వచనాలు.. అవినీతి అనకొండ మోసాలు. బోగస్ పంచనామాలు, నకిలీ వోచర్‌లతో తనశాఖకే కన్నం వేయగా, లీగల్ మెట్రాలజీలో అన్నీ ఇల్లీగల్ దందాలే అని స్పష్టమవుతోంది. బడా రాజకీయ నేతలు తన చెప్పుచేతల్లో ఉంటారని చెప్పుకుంటూ కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులను వేధించడం వెన్నతో పెట్టిన విద్య. ఎస్‌ఆర్‌లో విద్యార్హత వివరాల ఎంట్రీకి టెక్నికల్ అసిస్టెంట్ నుంచి రూ.లక్ష డిమాండ్ చేయగా తృటిలో ఏసీబీ నుంచి తప్పించుకోగా పౌరసరఫరాలశాఖ కమిషనర్ శాఖాపర విచారణలో నిజమని తేలడంతో లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ విజయసారథిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో శాఖాపర విచారణలో అతని లీలలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి.
పంచనామాతోశాఖకే పంగనామం
తూనికలు, కొలతలశాఖ పేరుకు చిన్న శాఖే అయినా విధులు సక్రమంగా నిర్వహిస్తే ప్రతీ సామాన్యుడికి నాణ్యమైన సేవలందుతాయి. సదరుశాఖ కొన్నేళ్లుగా అవినీతికి నిలయంగా మారింది. ఇటీవల సస్పెండ్ అయిన లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ విజయసారథి తనిఖీల సమయంలో బోగస్ పంచనామా కాపీలను వెంట తీసుకెళ్లడం, కేసు నమోదు చేస్తున్నట్లు హైరానా చేయడం, రెండు లక్షలు డిమాండ్ చేయడం, కనీసం రూ.50వేల నుంచి రూ.లక్ష వసూలు చేయకుండా వెళ్లడన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సొంతంగా ముద్రించిన బోగస్ పంచనామా బుక్‌తో విధులు నిర్వహించడం ఇతనికే చెల్లుతుండగా.. షాపింగ్ మాళ్లు, సూపర్‌మార్కెట్లు, రేషన్ దుకాణాలు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులు, చిరుతిళ్ల తయారీ కేంద్రాలు తదితర వ్యాపారవర్గాలు ఎవరైనా తనకు మామూళ్లు ఇవ్వాల్సిందే.
పెట్రోల్ బంకులే అడ్డా
మామూళ్లకు రుచిమరిగిన సదరు అధికారి పెట్రోల్ బంకులనే అడ్డాగా చేసుకునేవాడని తెలుస్తోంది. పొద్దంతా తనిఖీ చేయడం.. సాయంత్రం పెట్రోల్ బంకు వద్ద ఉండటం అక్కడి నుంచి మామూళ్లు తీసుకెళ్లడం చేస్తుంటారు. పెట్రోల్ బంకుకు సంబంధించిన నంబర్‌కు ఫోన్‌పే, గూగుల్ పే చేయాలని చెబుతుండగా వ్యాపారులు డబ్బులు పంపించడం అక్కడి నుంచి నగదు రూపంలో తీసుకెళ్తుంటారని సొంత శాఖే చర్చించుకుంటోంది. వాచ్‌మెన్, డ్రైవర్ ద్వారా మామూళ్లు వసూలు చేయడం, అడిగినంత ఇవ్వకపోతే తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తుంటారని వ్యాపారులు వాపోయారు. తన వసూళ్లకు సహకరించేందుకు నిర్మల్ జిల్లాలో ఉన్న వాచ్‌మెన్‌ను కరీంనగర్‌కు డిప్యూటేషన్‌పై నియమించుకున్నాడని సమాచారం. సదరు విషయాలపై ఏసీబీ పూర్తిస్థాయిలో కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.
తన కింది స్థాయి ఉద్యోగి సర్వీస్ బుక్‌లో విద్యార్హత వివరాలను ఎంట్రీ చేయడంలోనూ హస్తలాఘవాన్ని చాటారు. టెక్నికల్ అసిస్టెంట్ నవీన్ 2023లో ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ద్వారా డిగ్రీ పాసై పట్టా సమర్పించగా ఆ వివరాలు ఎంట్రీ చేసేందుకు రూ.లక్ష డిమాండ్ చేశారు. అలాగే రెండేళ్లుగా వార్షిక ఇంక్రిమెంట్లు నిలిపివేశారు. దీంతో నవీన్ ఏసీబీని ఆశ్రయించగా పసిగట్టిన అసిస్టెంట్ కంట్రోలర్ విజయసారథి తృటిలో తప్పించుకున్నారు. దీంతో గత డిసెంబర్‌లో పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు ఫిర్యాదు చేయగా శాఖాపర విచారణలో నిజనిజాలు నిగ్గు తేలగా సస్పెన్షన్ వేటు వేశారు. గతంలోనూ టెక్నికల్ అసిస్టెంట్ నవీన్‌కుమార్ ఐటీ పరిధిలోకి రానప్పటికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదని 2020లో కరోనా సమయంలో డ్రాయింగ్ ఆఫీసర్‌గా ఉన్న విజయసారథి 8 నెలల జీతాన్ని నిలిపేశారని తెలుస్తోంది. ఓ మహిళా అధికారిని కూడ తీవ్రంగా వేధించగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పక్కా సమాచారం. కశ్మీర్‌గడ్డలోని రైతుబజార్‌లో టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మి తనిఖీలు చేపట్టగా లోపాలు బయటపడగా తానెక్కడ ఇరుక్కపోతానోనని చౌకీదారుగా డిమోషన్ కల్పిస్తానని, ఎస్‌ఆర్‌లో ఓ పేజీనే తొలగించి నానాభయభ్రాంతులకు గురి చేశారు. శాఖాపరంగా ఎదుర్కోవడంతో తీరా ఎస్‌ఆర్‌లో పదోన్నతికి సంబంధించి జిరాక్స్ ప్రతిని చేర్చారు.


