అక్రమాలకు ముకుతాడు!
కరీంనగర్ అర్బన్: యూరియా అక్రమాలకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తోంది. రైతులు కాకుండా పరిశ్రమలు, ఇతరత్రా వ్యాపారాలకు యూరియా తరలుతుండగా.. లక్షిత వర్గానికే చేరేలా యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఈనెల 20 నుంచి యాప్ అందుబాటులోకి రానుండగా.. ఈనెల 18, 19ల్లో వ్యవసాయ అధికారులకు శిక్షణనివ్వనున్నారు. ప్రస్తుతం ఆధార్/బయోమెట్రిక్‌తో యూరియా పంపిణీ చేస్తుండగా.. యాప్ అందుబాటులోకి రాగానే స్లాట్ విధానంలో యూరియా పంపిణీ చేయనున్నారు. వానా కాలం సీజన్‌లో యూరియా కోసం రైతులు బారులు తీరడం, పలు మండలాల్లో అవసరం మేరకు లభ్యం కాకపోవడంతో ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి నుంచి అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు రైతులకు సరిపడా లభించేలా కొత్తగా బుకింగ్ విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 3.38లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. రెండు సీజన్లు కలిపి 90వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. పత్తి పంటను విక్రయించుకునేందుకు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్నట్లే.. రైతులు యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని యూరియా బుకింగ్ చేసుకోవచ్చు.
విడతలవారీగా..
రైతులు ఒకేసారి కాకుండా విడతలవారీగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయిదెకరాల్లో భూమి ఉ న్న రైతులు రెండు విడతల్లో, 5 నుంచి 20 ఎకరాల భూమి ఉన్న రైతులు మూడు విడతల్లో, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం భూమి ఉన్న రైతులు నాలుగు విడతల్లో యూరియా తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఫోన్‌లోనే బుకింగ్..
యూరియా బుకింగ్ యాప్‌లో పట్టాదారు పాసు పుస్తకం నంబర్ నమోదు చేయగానే లింక్ చేసిన ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. సదరు నంబర్ నమోదు చేయగానే రైతుకు ఎన్ని ఎకరాలుంది.. ఏ పంట వేశారనే వివరాలతోపాటు ఆ పంటకు ఎంత యూరియా అవసరమనే సమాచారం, బుకింగ్ ఐడీ వస్తుంది. ఏదైనా అధీకృత రీటైలర్ లేదా సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. బుకింగ్ కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుంది. ఆలోగా యూరియా తీసుకోనట్లయితే తిరిగి అది స్టాక్‌లోకి వెళ్తుంది. ఈ యాప్‌తో జిల్లా మొత్తంలో యూరియా ఎక్కడెక్కడ అందుబాటులో ఉందనే సమాచారం జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు సైతం తెలిసిపోతుంది.
ప్రస్తుతం ఆధార్‌తో పంపిణీ
కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఎంఎఫ్‌ఎంఎస్) ప్రవేశపెట్టి వ్యాపారులతోపాటు సంఘాలకు పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) మిషన్లు సరఫరా చేసింది. ఇందులో ఆధార్ నంబర్ నమోదు చేసి రైతుల వేలిముద్రలు తీసుకొని ఎరువులు విక్రయిస్తున్‌న్రాు. దీంతో ఆధార్ కార్డు ద్వారా ఎన్ని బస్తాలు తీసుకున్నారో పీఓఎస్ మిషన్లలో తెలుస్తుంది. అధికంగా తీసుకొని నిల్వ చేసుకునే వీలుండదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ వేరేవారి ఆధార్ తీసుకొస్తే సంబంధిత రైతు చరవాణికి వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి.
పంట వివరాలెలా..
ఇదిలా ఉండగా.. యాసంగి క్రాప్ బుకింగ్ ఫిబ్రవరి వరకు పూర్తి కాదు. అలాంటప్పుడు రైతులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేశారనేది ఎలా నిర్ధారిస్తారు? ఏ ఆధారంగా యూరియా కేటాయిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా ఒకే సమయంలో రైతులకు యూరియా అవసరం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి లక్ష మంది రైతులు నమోదు చేసుకుంటే యాప్ పని చేస్తుందా? సర్వర్ సపోర్ట్ చేస్తుందా?.
15 రోజులకోసారి..
15 రోజులకోసారి యూరియా ఇస్తారు. అయితే మొదటి 15 రోజుల్లో కొరతతోనో లేక రైతులు రావడానికి వీలు లేకనో లేదా ఆర్థిక సమస్య కారణంగానో యూరియా లభించకపోతే తర్వాత రెండు కలిపి ఇస్తారా? లేదా ఎగవేస్తారా అన్నది స్పష్టత లేదు. కౌలు రైతుల నమోదుకు అసలు రైతులు అంగీకరించే పరిస్ధితి లేదు. ఎకరం వరికి కేవలం 2 బస్తాల యూరియా మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా మొక్కజొన్నకు 3 బస్తాలు, జొన్న పంటకు 2 బస్తాలివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


