సమర్థతకు సలాం.. కావొద్దు గులాం | - | Sakshi
Sakshi News home page

సమర్థతకు సలాం.. కావొద్దు గులాం

Dec 17 2025 6:49 AM | Updated on Dec 17 2025 6:49 AM

సమర్థతకు సలాం.. కావొద్దు గులాం

సమర్థతకు సలాం.. కావొద్దు గులాం

సమర్థతకు సలాం.. కావొద్దు గులాం ● ప్రతీ గ్రామం ‘సింగారం’ను మరిపించాలి ● ప్రతీ ఓటు కీలకమే..

కరీంనగర్‌ అర్బన్‌: ప్రజాస్వామ్యంలో ఓటుకున్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. గ్రామ తలరాతను మార్చే శక్తి ఓటరుదే. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తవగా.. తుది విడతగా బుధవారం ఎన్నికలు ముగియనున్నాయి. హుజూరాబాద్‌, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్‌ మండలాల్లోని గ్రామ పంచాయతీలకు పోలింగ్‌ జరగనుండగా.. అభ్యర్థులు ఎవరికి వారుగా ప్రచారం పూర్తి చేశారు. ఈ క్రమంలో ఓటరు ఓటు ప్రాధాన్యం చాటేలా తీర్పునివ్వడమే ఉత్తమం. ఇటీవల ఫలితాల్లో ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థులుండగా.. ఓట్లు సమానంగా వచ్చి టాస్‌తో గెలిచిన అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఓటు కీలకమేనన్నది సుస్పష్టం. ఈ క్రమంలో ప్రలోభాలకు లొంగకుండా ఓటరు తనదైన శైలిలో ఓటును సద్వినియోగం చేసుకోవడం అత్యవసరం.

ఆ ఊరును గుర్తుంచుకోండి..

ఓటర్లంతా సింగారంను మరిపించేలా వ్యవహరించడం సుపరిపాలనకు బీజం వేసినట్లే. మహబూ బాబాద్‌ జిల్లా బయ్యారం మండలం సింగారం గ్రా మంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్‌ నమోదైంది. ఏ ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. 875 మంది ఓటర్లుండగా.. అందరూ ఓటేసి ఆదర్శంగా నిలిచారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నా.. పోలింగ్‌ రోజున స్వగ్రామం చేరి అందరూ ఓటేశారు.

నిష్పక్షపాతం..

కులం, మతం, వర్గం, కుటుంబం, తమవారంటూ పక్షపాతం చూపకుండా అందరినీ సమానంగా చూసే వ్యక్తి ఉండాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో పక్షపాతం చూపకుండా లక్షిత వర్గానికి అందేలా చూడాలి.

సమన్వయంతో..

గ్రామంలో ఏమేం సమస్యలున్నాయి.. వాటి పరిష్కార మార్గాలు.. నిధుల సమీకరణలో చాకచక్యం ఉండాలి. అధికార యంత్రాంగంతోపాటు ప్రజాప్రతినిధుల సమన్వయంతో ముందుకెళ్లేవారే అవసరం. గ్రామంలో ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు, ఇతర నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి. గ్రామసభలు నిర్వహించి నిర్ణయం మేరకు అడుగులేయాలి.

శాంతియుతంగా..

ప్రజల సమస్యలు తనవిగా భావించి, ప్రజా ప్రయోజనమే ముఖ్యమనే వారు కావాలి. గ్రామంలో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌, రహదారులు, విద్య, వైద్యం, గ్రంథాలయం తదితర వసతుల కల్పనపై దృష్టి పెట్టే నేర్పరి అవసరం. గ్రామంలో ఘర్షణలు, అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవాలి. శాంతియుత వాతావరణం ఉండేలా చొరవ చూపాలి.

పారదర్శకత..

ప్రజలకు ఏ కష్టమొచ్చినా గ్రామ సర్పంచ్‌ వద్దకే వెళ్తారు. సర్పంచ్‌గా గెలిచినవారు కొందరు పట్టణాలకు వెళ్తుంటారు. స్థానికంగా ఉండి ప్రజల కష్టాల్లో భాగమయ్యే వ్యక్తి కావాలి. అలాగే వచ్చే నిధులను సొంత అవసరాలకు కాకుండా.. గ్రామానికే పారదర్శకంగా వినియోగించాలి. ప్రతీ రూపాయికి లెక్క చూపేవారు కావాలి. జవాబుదారీతనంగా ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement