ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
హుజూరాబాద్/జమ్మికుంట/ఇల్లందకుంట: మూడో విడతలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు–2025లో భాగంగా కరీంనగర్ జిల్లాలో బుధవారం చివరి విడత పోలింగ్ జరగనుంది. జమ్మికుంట, ఇల్లందకుంట, హుజూరాబాద్, వీణవంక, సైదాపూర్ మండలాల్లోని పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. హుజూరాబాద్ మండలానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, జమ్మికుంట మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఇల్లందకుంట మండలానికి సీతారామచంద్రస్వామి దేవాలయ ఫంక్షన్ హాల్‌లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని ప్రతీ కౌంటర్, ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలన్నారు. ఏవైనా సమస్యలుంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు జిల్లాకేంద్రానికి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని పరిశీలించారు. ఆర్డీవో రమేశ్‌బాబు, ఇల్లందకుంట తహసీల్దార్ రాజమల్లు, ఎంపీడీవో రాజేశ్వర్‌రావు, ఎంఈవో రాములునాయక్, ఎస్సై క్రాంతికుమార్ తదితరులున్నారు.


