రిజిస్టర్లు చిరుగుతున్నాయని..
కరీంనగర్ కార్పొరేషన్: దశాబ్దాల తరువాత నల్లాల కనెక్షన్లను ప్రక్షాళన చేసేందుకు నగరంలో నగరపాలకసంస్థ చేపట్టిన సర్వేలో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. డిజిటలైజేషన్‌కు ముందటి వివరాల సేకరణ, నమోదులో సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న అనేక ఫిర్యాదుల నేపథ్యంలో దశాబ్దాల నాటి పాత రిజిస్టర్లు తీస్తుంటే, అవి చిరిగిపోతుండడంతో అతిపెద్ద సమస్యగా మారింది. చిరుగుతున్న రిజిస్టర్లను స్కానింగ్ చేయడం ద్వారా వివరాలను నమోదు చేసేందుకు నగరపాలకసంస్థ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
కొనసాగుతున్న సర్వే
నల్లాల కనెక్షన్లను క్రమబద్ధీకరించడం, ఆదాయం పెంచుకోవడం లక్ష్యంగా నగరపాలకసంస్థ నల్లాలపై సర్వే చేపట్టింది. నల్లాకనెక్షన్ తీసుకున్నారా లేదా, బిల్లులు సక్రమంగా చెల్లిస్తున్నారా, గృహావసరాలకు తీసుకొని వాణిజ్య అవసరాలకు వాడుతున్నారా అనేదానిపై ప్రాధాన్యత ఇస్తున్నారు. సర్వే అనంతరం గుర్తించిన కనెక్షన్లకు నోటీసులు జారీచేస్తున్నారు. నల్లా కనెక్షన్లను క్రమబద్ధీకరిస్తున్నారు. కమర్షియల్ అయితే డొమెస్టిక్ నుంచి కన్వర్షన్ చేస్తున్నారు. ఇప్పటివరకు నగరంలోని ఆరు ప్రైవేట్ హాస్పిటల్స్ గృహావసరాల పేరిట కనెక్షన్లు తీసుకున్నట్లు గుర్తించి, నోటీసులు ఇచ్చారు. ఆ హాస్పిటల్స్ నల్లాలను కమర్షియల్‌కు కన్వర్ట్ చేశారు. కన్వర్షన్ చార్జీలుగా రూ.38 వేల చొప్పున వసూలు చేశారు. ఇప్పటివరకు రెండు అపార్ట్‌మెంట్లు కూడా సాధారణ డిపాజిట్ కింద తీసుకున్నట్లు గుర్తించి, రూ.లక్ష కన్వర్షన్ చార్జీలు వసూలుచేశారు.
వినియోగదారుల గగ్గోలు
సర్వే సందర్భంగా తేలిన అంశాలకు అనుగుణంగా వినియోగదారులకు నగరపాలకసంస్థ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. నల్లా బిల్లులు ఏళ్లుగా బకాయిలు ఉన్నవాళ్లు, డొమెస్టిక్ తీసుకొని కమర్షియల్ వాడుతున్న వాళ్లు తదితరులు ఉన్నారు. తాము బిల్లులు సంవత్సరాల నుంచి చెల్లిస్తూ వస్తున్నా, బకాయిలు చూపించడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగరపాలకసంస్థ ఉద్యోగులతో వాగ్వాదానికి దిగుతున్నారు. తాము చెల్లించిన రశీదులు కూడా పట్టుకొని వస్తున్నారు. ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించిన వివరాలు చూపకపోవడం, కనెక్షన్ వివరాలు ఆన్‌లైన్‌లో లేకపోవడంతో సమస్యలు తీవ్రమవుతూ వచ్చాయి.
రిజిస్టర్ల స్కానింగ్
నగరపాలకసంస్థలో 2020 నుంచి నల్లా కనెక్షన్ల వివరాలు డిజిటలైజేషన్ అయ్యాయి. దాదాపు 1990నుంచి నల్లా కనెక్షన్ల వివరాలు మాన్యువల్‌గా ఉన్నాయి. దాదాపు 42 వేల నల్లా కనెక్షన్ల వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేశారు. ఇప్పుడు వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సర్వేలో తేలిన అంశాల ఆధారంగా వివరాలు చూసేందుకు రిజిస్టర్లు తీయాల్సి వస్తోంది. రిజిస్టర్లు దశాబ్దాల క్రితంనాటివి కావడం, కనీసం తీసి కూడా చూసిన దాఖలాలులేకపోవడంతో అవి కాస్తా చిరుగుతున్నాయి. దీంతో నల్లా వివరాలు పూర్తిగా పోయే ప్రమాదం ఏర్పడింది. ఇందుకు విరుగుడుగా రిజిస్టర్లలోని నల్లా కనెక్షన్ వివరాలను తాజాగా అధికారులు స్కాన్ చేస్తున్నారు. స్కాన్‌చేయడం ద్వారా ఆ వివరాలను కూడా డిజిటల్‌లో సంక్షిప్తం చేస్తున్నారు. 27 పాత రిజిస్టర్‌లను స్కానింగ్ చేస్తున్నారు. నల్లాల కనెక్షన్‌ల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశాల మేరకు అధికారులు చేస్తున్న కసరత్తు గాడినపడుతోంది.


