తొలి విడతకు సిద్ధం
కరీంనగర్ అర్బన్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణికుముదిని కలెక్టర్‌తో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ జిల్లా పరిస్థితిని వివరించారు. మొదటి విడత ఎన్నికలకు పూర్తి సంసిద్ధతతో ఉన్నామన్నారు. గంగాధర, చొప్పదండి, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయని, 5 మండలాల్లోని 92 గ్రామ పంచాయతీలకు గానూ మొత్తం 866 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సరిపడా భద్రత, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ గౌస్‌ఆలం తెలిపారు. డీఆర్‌వో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, డీపీవో జగదీశ్వర్ పాల్గొన్నారు.
పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్
గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికలు ముగిసే వరకు గ్రామాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. సైలెన్స్ పీరియడ్‌లో ప్రజలు గుంపులుగా చేరరాదని స్పష్టం చేశారు. ఏదేని ఉల్లంఘన జరిగినట్లు గమనిస్తే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల నోడల్ అధికారులను ఆదేశించారు.
‘ఓటే భవితకు బాట’ ఆడియో సీడీ ఆవిష్కరణ
తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కంసాని ఉదయ, ప్రకృతి ప్రకాష్ నిర్మించిన ‘ఓటే భవితకు బాట’ ఆడియో సీడీని కలెక్టర్ పమేలా సత్పతి మంగవారం ఆవిష్కరించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఆవిష్కరించారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని అన్నారు. పాటలను రచించిన తెలంగాణ సాంస్కృతి సారధి పాటల రచయిత ప్రకృతి ప్రకాష్, ఆలపించిన కంసాని ఉదయను అభినందించారు.


