భర్త హఠాన్మరణం.. భార్య బలవన్మరణం
వీర్నపల్లి(సిరిసిల్ల): నలభై రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన దేవోల్ల హన్మంతు సెప్టెంబర్ 26న బహ్రెయిన్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. ఒక పక్క అప్పులు, మరో పక్క భర్త మరణంతో తీవ్ర మానసిక వేదనకు గురైన భార్య సుమలత(30) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పాఠశాలకు వెళ్లిన చిన్న కుమార్తె వచ్చేసరికి తలుపులు మూసి ఉండడంతో కిటికీలోంచి చూడగా తల్లి ఉరేసుకొని కనిపించింది. వెంటనే స్థానికులకు తెలుపడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై లక్ష్మణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఇందు, లాస్య ఉన్నారు. దంపతుల మరణంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
నలభై రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి.. అనాథలైన చిన్నారులు


