
వరి పంటపై గడ్డి మందు
● భూ తగాదాలతో ప్రత్యర్థి పనేనంటున్న బాధితుడు
సైదాపూర్: రెండేళ్ల నుంచి కొనసాగుతున్న భూ తగాదాలో భాగంగా పచ్చని వరి పంటకు ప్రత్యర్థులు గడ్డి మందు కొట్టి నాశనం చేశారని ఓ రైతు వెన్నంపల్లిలోని వరి చేనులో బోరున విలపించాడు. బాధితుడి వివరాల ప్రకారం.. ఆరెపల్లికి చెందిన బాగోతపు వెంకటయ్య అనే రైతు వెన్నంపల్లికి చెందిన మొలుగూరి లింగయ్య అనే రైతు వద్ద సర్వే నం.300/2లో 2.25 ఎకరాలు కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాడు. రెండేళ్ల నుంచి మొలుగూరి రాజయ్య అందులో 0.20 గుంటల భూమి ఉందని గొడవ పడుతున్నాడు. వెంకటయ్య వేసిన పంటలను ప్రతి ఏటా ధ్వంసం చేస్తున్నాడు. వెంకటయ్య పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నాడు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. 25 రోజుల క్రితం వరి నాటు వేశాడు. పచ్చగా ఉన్న వరి పంటను శుక్రవారం రాత్రి గడ్డి మందు కొట్టి ధ్వంసం చేశారని వెంకటయ్య వరి చేనులో విలపిస్తూ ఆరోపించాడు. భూ సమస్యను పరిష్కరించి పంట ధ్వంసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.