జయిద్దామిలా..
● ఎప్పుడు ఒత్తిడికి గురవుతున్నామో ఒకచోట నమోదు చేసుకోవాలి.
● ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటి పద్ధతులు అవలంబించాలి.
● క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
● ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటంతో పాటు కంటి నిండా నిద్రపోవాలి.
● కెఫిన్ ఎక్కువగా ఉండే కాపీ, శీతల పానీయాలు తాగటం మానేయాలి.
● ప్రతికూల ఆలోచనలను మొగ్గ దశలోనే తుంచేయాలి.
● ఒత్తిడికి గురైనప్పుడు.. దాని నుంచి బయ టపడటానికి కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం తీసుకోవాలి.
తేలికగా తీసుకోవద్దు...
మెదడు మన మొత్తం శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. మెదడుకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా తేలిగ్గా తీసుకోకూడదు. రోగికి తలలో నిరంతరం నొప్పి, జ్ఞాపకశక్తి కోల్పోవడం, తల పరిమాణం పెరగడం, ఏదైనా ప్రమాదంలో తలకు గాయాలు లేదా గందరగోళ స్థితి ఉంటే ఇవన్నీ మెదడు వ్యాధుల లక్షణాలే. అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి అయినప్పటికీ మెదడు ఆరోగ్యాన్ని తేలికగా తీసుకుంటారు. దీంతో న్యూరో రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మెదడు సంబంధ వ్యాధులతో పోరాడుతున్న ఏ వయసు వారికై నా ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరమని వైద్యులు చెబుతున్నారు.
ఆదిలోనే గుర్తిస్తే..
శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటేనే ఏపనినైనా చురుగ్గా చేసుకోగలం. అదే ప్రతికూల ఆలోచనలు మనసులోకి చేరితే ఒత్తిడిని ఎదుర్కొనటమే కాదు.. ఏపనిపైనా ఏకాగ్రత పెట్టలేం. అందుకే అలాంటి మానసిక సమస్యలను ఆదిలోనే గుర్తించాలంటున్నారు నిపుణులు. చాలామంది ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవటంతో పాటు సరైన సమయంలో గుర్తించలేకపోతున్నారని.. తద్వారా అది క్రమంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే స్థితికి దారితీస్తుందంటున్నారు. ఒత్తిడి లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే మేలని సూచిస్తున్నారు.
ఏటా సుమారు 30 వేల మంది..
ఉమ్మడి జిల్లాలో ఏటా సుమారు 30 వేల మంది మానసిక ఒత్తిళ్లతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. వీరిలో చాలామంది ఒత్తిడికి గురయ్యాక ధూమపానం, మద్యం సేవనం, గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసై, తమ జీవితాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మానసిక ఆరోగ్యం పట్ల సమాజం నిర్లక్ష్యంగా ఉండటం, అవగాహన లోపించడం దీనికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
కరీంనగర్‌టౌన్: శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మెదడుకు వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. బ్రెయిన్‌కు వచ్చే ప్రమాదకర వ్యాధులలో బ్రెయిన్ ట్యూమర్ల కేసులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన తలనొప్పి వస్తే, మాట్లాడడంలో ఇబ్బంది ఉంటే ఇవి బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. మెదడుపై ఒత్తిడి పెరగడం వల్ల ఇటీవల పక్షవాతం, పార్కిన్సన్ వంటి వ్యాధులు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధులు మెల్లమెల్లగా మనిషి శరీరాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి.
మైండ్ ఫిట్‌గా ఉండాలంటే..
పోషకాలున్న ఆహారం తీసుకోవాలి
రోజూ వ్యాయామం చేయాలి
ఒత్తిడికి దూరంగా ఉండాలి
సెల్ఫోన్ వాడకాన్ని తగ్గించాలి
ధూమపానం, మద్యపానాన్ని వదిలేయాలి
రోజూ కనీసం 8 గంటలు నిద్రపోవాలి
మెదడు వ్యాధులను నిర్లక్ష్యం చేయొద్దు
మెదడుకు సంబంధించి ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయవద్దు. వయస్సుతో సంబంధం లేకుండా ఫిట్స్, పక్షవాతం, బ్రెయిన్ ట్యూమర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధులకు మానసిక ఒత్తిడే కారణం. ముఖ్యంగా పిల్లల్లో సెల్‌ఫోన్ వాడటం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు ఈ విషయంపై జాగ్రత్త వహించాలి. ప్రతీ ఒక్కరికి 8 గంటలు నిద్ర తప్పనిసరిగా అవసరం.
– డాక్టర్ రాజీవ్‌రెడ్డి, న్యూరోసర్జన్, మెడికవర్
ఓ మనిషి ఒత్తిడికి చిక్కకు!