
తలనీలాలకు టెండ‘రింగ్’..?
మల్యాల: కొండగట్టు ఆంజన్న ఆలయంలో తలనీలాల సేకరణకు సంబంధించి కాంట్రాక్టర్లు సిండికేట్ అయినట్లు సమాచారం. తద్వారా ఆలయానికి ఏకంగా రూ.కోటి మేర ఆదాయానికి గండి పడుతోంది. తలనీలాల సేకరణకు ఈనెల 18న టెండర్ నిర్వహించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడడంతో ఈ ప్రక్రియను హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో చేపట్టారు. అయితే టెండరుదారులు సిండికేట్‌గా మారినట్లు తెలుస్తోంది. కేవలం కిలోకు రూ.8,500 మాత్రమే కోట్ చేసినట్లు సమాచారం. ఇదే తలనీలాలకు యాదగిరి గుట్టలో కిలో రూ.20వేల చొప్పున పలుకుతోంది. కానీ.. ఇక్కడ మాత్రం గతేడాది కూడా కిలో రూ.8,500కు మాత్రమే టెండర్ దక్కించుకున్నారు. ఈ ఏడాది కూడా అదే ధరకు కాంట్రాక్టర్లు కుమ్మకై ్కయ్యారు. దీంతో ఆలయ అధికారులు ఆ టెండర్‌ను వాయిదా వేసి ఈ నెల 24 మరోసారి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
● ఈనెల రెండున ప్రకటన
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో గతేడాది ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు భక్తులు స్వామివారికి సమర్పించిన తలనీలాలు కిలో చొప్పున సేకరించేందుకు టెండర్ నిర్వహణకు ఈనెల 2న ప్రకటన జారీ చేశారు. వేలంలో పాల్గొనే వేలందారులు రూ.10లక్షల డిపాజిట్ డీడీతోపాటు షెడ్యూల్ ధర రూ.2,360 చెల్లించాలని సూచించారు. ఈనెల 18న కొండగట్టు ఆలయంలో టెండర్ నిర్వహించారు. ఇందులో 13మంది టెండర్‌దారులు పాల్గొన్నారు. కొంతమంది సీల్డ్ టెండర్ల ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు తలనీలాల టెండర్ ఈ నెల 24కు వాయిదా వేశారు.
● వేలంలో పాల్గొనే వారికి నిబంధనలు అడ్డు
తలనీలాల టెండర్ ఈనెల 24కు వాయిదా వేయగా.. కొత్తగా వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్న వారికి అవకాశం లేకుండా దేవాదాయ శాఖ నిబంధనలు అడ్డుపడుతున్నాయి. అధిక సంఖ్యలో టెండర్‌దారులు పాల్గొనేలా ప్రోత్సహించాల్సిన అధికారులు.. కొంతమందికే పరిమితం చేస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్‌దారులు అంతర్గతంగా కుమ్మకై ్క ఆలయ ఆదాయానికి గండికొడుతున్నారనే విమర్శలున్నాయి. గతంలో వేలం పాటకు 24గంటల ముందే డీడీలు చెల్లించే అవకాశం ఉండేది. ప్రస్తుతం రెండు రోజుల ముందే వేలందారుల దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. దీంతో అధిక సంఖ్యలో వేలందారులు పాల్గొనే అవకాశం తగ్గిపోయింది. కొద్దిమంది టెండర్‌దారుల రాకతో ఆలయ ఆదాయానికి గండిపడుతోంది. తాజాగా ఈనెల 24న నిర్వహించే టెండర్‌లో కొత్తవారికి అవకాశం లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారి అంజన్న ఆలయం ఆదాయానికి గండికొట్టే ప్రమాదం ఉంది. కొండగట్టులో ప్రస్తుతం సుమారు 500కిలోల తలనీలాలు నిల్వ ఉన్నాయి. నిజమైన వేలందారులు ఎనిమిది మంది లోపే ఉండగా.. మిగిలిన వారు బినామీలుగా సిండికేట్ కావడానికి వేలంలో పాల్గొంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
● డిపాజిట్ డీడీ డబ్బులు ఎక్కడికో..?
తలనీలాల టెండర్‌లో పాల్గొనేవారు రూ.10లక్షల డిపాజిట్ డీడీతోపాటు రూ.2,360 షెడ్యూల్ ధర చెల్లించాల్సి ఉంటుంది. అయితే అధికారులు మా త్రం అదనంగా మరో రూ.10వేలు వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గతేడాది కూడా రూ.10వేలు వసూలు చేశారని వేలంలో పాల్గొన్న వ్యక్తి తెలిపారు. ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో..? వాటిని ఎలా ఖర్చు చేస్తున్నారో విచారణ చేపట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
అంజన్న ఆదాయానికి దాదాపు రూ.50 లక్షలు గండి
యాదాద్రిలో కిలో రూ.20 వేలు.. ఇక్కడ మాత్రం రూ.8,500
సరైన ధర రాకపోవడంతో వాయిదా.. ఈనెల 24 తిరిగి టెండర్