
చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌కు అప్పగించండ
గోదావరిఖని: ‘మీకు చేతకాకపోతే.. మీకు నడపడం రాకపోతే.. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌కు అప్పగిస్తే మూడురోజుల్లో ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం’ అని మాజీమంత్రి జగదీశ్వర్‌రెడ్డి సవాల్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ రంగానికి సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను గోస పెడుతోందన్నారు. ప్రస్తుతం సాగునీరు అందించేందుకు కాళేశ్వరం జోన్ పరిధిలోని ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని, కావాలనే కాళేశ్వరం నీళ్లను రైతులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధిలో ముందుకు సాగి సుభిక్షంగా ఉండేదని గుర్తుచేశారు. కమీషన్లు, కంపు మాటలు తప్ప 18 నెలల్లో జరిగిందేమీ లేదన్నారు. అజ్ఞాని ముఖ్యమంత్రిగా ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ సుభిక్షంగా ఉంచితే సీఎం రేవంత్‌రెడ్డి అప్పల పాలు చేస్తున్నారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మేల్కొల్పిందే కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న తెలంగాణను సీఎం రేవంత్‌రెడ్డి అప్పుల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుజోన్ పరిధిలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, కన్నెపల్లి బ్యారేజీలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, లక్షలాది ఎకరాలకు నీళ్లందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే రెండుపంటలు ఎండబెట్టారన్నారు. అన్నిరంగాలు వెనకపడి పోయాయన్నారు. నిరంతరం కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఆదాయంలో రూ.15వేల కోట్లు తగ్గిందన్నారు. కేసీఆర్ పాలనలో ఏటా రూ.15వేల కోట్ల ఆదాయం పెరిగిందన్నారు. సమావేశంలో నాయకులు కౌశిక హరి, నడిపెల్లి మురళీధర్‌రావు, పీటీ స్వామి, పెంట రాజేశ్, బొడ్డు రవీందర్, మారుతి చిలకలపల్లి శ్రీనివాస్, అచ్చే వేణు, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
మూడురోజుల్లో ప్రతీ ఎకరాకు సాగు నీరందిస్తాం
అజ్ఞాని రేవంత్ పాలనలో తిరోగమనంలో రాష్ట్రం
మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ధ్వజం