
జువెల్లరీ షాపులో చోరీ
జమ్మికుంట: జమ్మికుంటలోని జువెల్లరి షాపులో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. 2 తులాల బంగారం, 2 కిలోల వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. పట్టణంలోని ధనాల కొండయ్య కాంప్లెక్సులో హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన భోగి వంశీకృష్ణ అనే వ్యక్తి బ్రాండ్ కళ్యాణి జువెల్లరి షాపు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం షాపు మూసి ఇంటికెళ్లాడు. శనివారం ఉదయం పక్కన గల షాపు వ్యక్తులు జువెల్లరి షాపు షెటర్ పగలగొట్టి ఉందని సమాచారమివ్వడంతో షాపు వద్దకొచ్చి పరిశీలించారు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు 2 తులాల బంగారం, 2 కిలోల వెండి ఆభరణాలు చోరీ చేసినట్లు గుర్తించాడు. పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని కరీంనగర్ క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. హుజూరాబాద్ డివిజన్ ఏసీపీ మాధవి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలడిగి తెలుసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
కిరాణ దుకాణంలో..
పట్టణంలోని ఓ కిరాణం షాపులో చోరి జరిగింది. సీఐ వివరాల ప్రకారం.. కొండూరి కాంప్లెక్స్ పరిధిలో మున్సిపల్ పరిధి రామన్నపల్లి గ్రామానికి చెందిన కొలకాని గణేశ్ అనే వ్యక్తి కిరాణం దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. షాపు షెటర్ పగలగొట్టి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడినట్లు గుర్తించాడు. రూ.20వేల నగదు చోరీ జరిగిందని బాధితుడి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.