
అమ్మ నేను చనిపోతున్నా..
ముస్తాబాద్(సిరిసిల్ల): కన్నవారిని కట్టుకున్న వారిని పోషించుకునేందుకు పొట్ట చేతపట్టుకుని వచ్చిన వలసజీవి అర్ధంతరంగా తనువు చాలించాడు. కడసారి చూపు కోసం పరితపించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తరలించుకుపోయేందుకు డబ్బులు లేక ఇక్కడే ఖననం చేసేందుకు అంగీకరించడం విషాదకరం. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లిలో బచ్చు చౌదరి(33) అనే వలస కూలీ శుక్రవారం రాత్రి చెట్టుకు ఉరివేసుకున్నాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం మాల్డ జిల్లా చోటుపూర్ వెస్ట్‌పారకు చెందిన బచ్చు చౌదరి 10 రోజుల క్రితం చీకోడుకు మేసీ్త్ర పనులు చేసేందుకు వచ్చాడు. ఈనేపథ్యంలో స్వగ్రామంలోని కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందాడు. తన తల్లికి ఫోన్‌చేసి ‘అమ్మ నేను చనిపోతున్నా.. బతకాలని లేదంటూ..’ చెప్పి చెట్టుకు ఉరివేసుకున్నాడు. గమనించిన కార్మికులు బచ్చు చౌదరిని ఆసుపత్రికి తరలించేలోగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు, తల్లి ఉన్నారు. మృతదేహన్ని పశ్చిమబెంగాల్‌కు తరలించాలంటే రూ.లక్ష వరకు ఖర్చు అవుతుందని, తినేందుకు తిండిలేక ఇబ్బంది పడుతున్నామని వారు పేర్కొన్నారు. బచ్చు చౌదరికి అంతిమ సంస్కారాలు ముస్తాబాద్‌లోనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ తెలిపారు. ఎస్సై గణేశ్ ముస్తాబాద్‌లోనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మృతుని స్నేహితుడు బిష్ణుచౌదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
వలసజీవి బలవన్మరణం
కడసారి చూపునకు నోచుకోని కుటుంబం
ముస్తాబాద్‌లోనే వలసజీవి ఖననం