
ధన్యజీవులు!
● అపురూప త్యాగం దేహదానం ● వైద్య విద్యార్థులకు పాఠ్య పుస్తకం
● అవయవదానంతో పునర్జన్మ ● నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు ● ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న అవగాహన
మనం మరణించినా.. బతకవచ్చు. మన కళ్లు ఈలోకాన్ని చూస్తాయి. మన గుండె లబ్‌డబ్ అంటూ కొట్టుకుంటోంది. మన ఊపిరితిత్తులు శ్వాసను అందిస్తాయి. కిడ్నీలు శుద్ధి చేస్తూనే ఉంటాయి.. ఇదంతా శరీరంలోని అవయవ దానంతోనే సాధ్యమవుతుంది. కేవలం అవగాహన లేక అనేక మరణాలు మట్టిపాలు, నిప్పుపాలు చేస్తున్నారు. ఇంకొకరికి దానం చేస్తే, వారి ఆయుష్షు పెంచవచ్చు. బ్రెయిన్‌డెడ్‌తో అవయవ దానం చేస్తే కనీసం ఎనిమిది మందికి పునర్జన్మ ఇవ్వొచ్చు. నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు పంచవచ్చు. మళ్లీ మన కళ్లు ఈ లోకాన్ని చూడొచ్చు. దేహదానం చేస్తే.. మెడికో స్టూడెంట్స్‌కు పాఠ్యపుస్తకం కావచ్చు. వారి పరిశోధనకు దోహదపడవచ్చు. ఈ దానాలపై కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అవగాహన పెరుగుతోంది. దానం చేయడానికి అంగీకారాన్ని ప్రకటించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.
‘భగవంతుడి కోసం కళ్లు పెకిలించి ఇచ్చిన భక్త కన్నప్ప... గురు దక్షిణ కోసం బొటనవేలిని కోసి ఇచ్చిన ఏకలవ్యుడు... దానంగా తొడకోసిచ్చిన శిబిచక్రవర్తి వీరంతా గొప్పవాళ్లయితే... ప్రస్తుత సమాజంతో లక్షలు, కోట్లున్నా కొనలేని.. కొనడానికి విలువకట్టలేని తమ నేత్రాలు, అవయవాలు, పార్థీవ దేహాలను దానం చేయడానికి ముందుకు వస్తున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కొందరు వ్యక్తులు ధన్యజీవులు’.. పరోపకారమే ఇదమ్ శరీరమ్.. అని సంపూర్తిగా నమ్మి తాము పుట్టిందే పరులకు ఉపకారం చేయడానికనుకొని మనసా.. వాచా.. కర్మ.. అని ఆచరించేవారు జీవించినంత కాలం ఇతరులకు సేవచేయాలని కోరుకోవడం సాధారణమైన విషయం. జీవం పోయిన తర్వాత కూడా ఇతరులకు ఉపయోగపడడమే గొప్ప విషయం.
స్ఫూర్తి

ధన్యజీవులు!