
14 మంది ట్రాన్స్‌కో సిబ్బందికి షోకాజ్ నోటీసులు?
కోరుట్ల: జూన్ 15న.. కోరుట్ల–మెట్‌పల్లి రోడ్‌లో గణపతి విగ్రహం తరలింపు సందర్భంగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందడం.. మరో తొమ్మిది మంది గాయపడిన ఘటనను ట్రాన్స్‌కో సీఎండీ కార్యాలయం సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. షాక్‌కు కారణమైన స్తంభాలు, వైర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. వల్లంపల్లి 33/11 కేవీ విద్యుత్ లైన్ వేలాడుతోందని, దీన్ని సరిచేయాల్సిన అవసరముందని, మరికొన్ని లైన్లు కూడా సరిచేయాలని రెండేళ్ల క్రితమే అప్పటి ఆ ఏరియా లైన్‌మెన్ పైస్థాయి అధికారులకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై స్థానిక ట్రాన్స్‌కో అధికారులు ఎవరూ దృష్టి పెట్టకపోవడం.. వల్లంపల్లి లైన్ క్రమంగా మరింత కిందికి జారి గణపతి విగ్రహం తరలింపు సందర్భంగా ప్రమాదానికి కారణమైంది. ఆ ప్రమాదం ఎలా జరిగింది..? ఏ స్థాయిలో నిర్లక్ష్యం చేశారు..? దీనికి ఎవరెవరు బాధ్యులు..? అనే విషయంలో ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ మొదలుపెట్టారు. మంగళవారం కోరుట్ల ఏడీఈ స్థాయి అధికారి ఒకరు, ఆరుగురు లైన్‌మెన్లు, మరో ఏడుగురు జూనియర్ లైన్‌మెన్లకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు సమాచారం. ప్రమాద సంఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. నోటీసులు అందుకున్న సిబ్బంది ఇచ్చే వివరణ ప్రకారం ప్రమాద సంఘటనకు బాధ్యులపై ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నారు.
కోరుట్లలో కరెంట్ షాక్ ఘటనపై..
వివరణ కోరిన సీఎండీ కార్యాలయం