
ఇప్పట్లో అయ్యేనా!
● రెండేళ్లుగా సా..గుతున్న కశ్మీర్‌గడ్డ రైతు బజార్ పనులు ● రోడ్లపై వ్యాపారాలతో ప్రజల ఇక్కట్లు
కరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్‌సిటీలో భాగంగా నగరంలోని కశ్మీర్‌గడ్డలో చేపట్టిన సమీకృత మార్కెట్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండేళ్లు దాటినా సగం పనులు కూడా కాలేదు. దశాబ్దాలుగా ఆదరణ ఉన్న కశ్మీర్‌గడ్డ రైతుబజార్ మళ్లీ అందుబాటులోకి రావడానికి మరెన్ని సంవత్సరాలు పడుతుందోనని ఈ ప్రాంత వాసులు, చిరువ్యాపారులు బేజారవుతున్నారు.
రూ.10 కోట్లతో నిర్మాణం
నగరంలో పద్మనగర్, కశ్మీర్‌గడ్డ మార్కెట్ నిర్మాణాలను స్మార్ట్‌సిటీ నిధులతో చేపట్టారు. పద్మనగర్ మార్కెట్ పూర్తి కాగా, నగరానికి దూరంగా ఉండడంతో డిమాండ్ తక్కువగా ఉంది. కశ్మీర్‌గడ్డ రైతు బజార్ పనులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. రూ.10 కోట్ల నిధులతో కశ్మీర్‌గడ్డలోని రైతు బజార్ స్థానంలో వెజ్,నాన్‌వెజ్ సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టారు.
రెండేళ్లయినా..
కశ్మీర్‌గడ్డ రైతుబజార్‌కు డిమాండ్ అధికంగా ఉంటుంది. టవర్‌సర్కిల్ సమీపంలోని ప్రధాన కూరగాయల మార్కెట్‌తో పాటు నగరంలో ఉన్న పు రాతన మార్కెట్ ఇది. అశోక్‌నగర్‌లో రైతు బజార్ నిర్మాణానికి ముందు ఇవే రెండు పెద్ద మార్కెట్లు అందుబాటులో ఉండేవి. కొత్త మార్కెట్ నిర్మాణంలో భాగంగా పాత రైతుబజార్‌ను పూర్తిగా తొలగించారు. ఆ స్థలంలో కొత్తగా సమీకృత మార్కెట్ నిర్మాణానికి 2023 జూన్ 21వ తేదీన శంకుస్థాపన చేశారు. కారణాలేవైనా పనులు మాత్రం ఇప్పటివరకు సగం కూడా చేయలేదు.
రోడ్లపైనే విక్రయాలు
పాత రైతుబజార్‌ను తొలగించి కొత్త మార్కెట్‌ను నిర్మిస్తుండడంతో వ్యాపారులు రోడ్లపై చేరారు. ఒక వైపు రోడ్డుపై తాత్కాలికంగా కూరగాయల వ్యాపారులకు ఏర్పాట్లు చేయగా, మరో వైపు రోడ్డుపైన కూడా వ్యాపారం కొనసాగుతోంది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కశ్మీర్‌గడ్డ మార్కెట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి, త్వరగా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.