
బల్దియా కమిషనర్ పేరిట ఫేక్ కాల్స్
● పన్నులు చెల్లించాలంటూ ఫోన్లు ● వాట్సప్ ద్వారా పేటీఎం స్కానర్ ● నమ్మొద్దంటూ కమిషనర్ విజ్ఞప్తి
కరీంనగర్ కార్పొరేషన్: ‘మున్సిపల్ కమిషనర్‌ను మాట్లాడుతున్నా.. మీ ట్యాక్స్ పెండింగ్‌లో ఉంది. స్కానర్ పంపిస్తున్నా.. కట్టండి’. ‘హే బాబు.. పంపించుకోలేదంటా ఇంకా.. పంపించండి.. ఇంకోసారి ఇలా అయితే కేసేస్తా చెబుతున్నా.’ ‘రూ.2,100 పంపించండి.. మీకోసం చేస్తున్నా, మీటింగ్ వెళ్లేదుంది’..అంటూ కరీంనగర్ నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ పేరిట ఫేక్‌కాల్స్ వచ్చాయి. రెండు రోజులుగా నగరంలోని పలువురి ఫోన్‌లకు 91210 97923 నంబర్ నుంచి కాల్స్ వచ్చాయి. తాను కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్‌ని మాట్లాడుతున్నానంటూ చెబుతూ, ట్యాక్స్ కట్టాల్సి ఉంది.. చెల్లించండంటూ వాట్సప్ ద్వారా స్కానర్ పంపించారు. ఫోన్ నంబర్ డీపీ, ట్రూకాలర్‌లోనూ ‘మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ కార్పొరేషన్ ఆఫీస్ తెలంగాణ కరీంనగర్’ అని ఉంది. కాగా, కాల్స్ చేసిన వ్యక్తి కమిషనర్ వాయిస్‌ని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయడం గమనార్హం. కాల్స్‌ను నమ్మిన ఓవ్యక్తి రూ.500 పంపి, తనకు ట్రేడ్ లైసెన్స్ రావడం లేదంటూ అధికారుల వద్దకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఫేక్ కాల్స్ నమ్మొద్దు: ప్రఫుల్‌దేశాయ్
కమిషనర్‌ను మాట్లాడుతున్నానంటూ వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మొద్దు. ఎలాంటి పన్నులు బకాయి ఉన్నా నేరుగా నగరపాలక సంస్థ కార్యాలయంలోని పౌర సేవా కేంద్రంలో, బిల్ కలెక్షన్ డివైస్ యంత్రాలతో మీ వద్దకు వచ్చే వార్డు ఆఫీసర్లకు (రెవెన్యూ బిల్ కలెక్టర్లు) మాత్రమే చెల్లించాలి. మీ సేవా కేంద్రంలో, మీ మొబైల్ ఫోన్ ఆన్‌లైన్ యాప్ ద్వారా ఇంటి నంబర్, పీటీఐఎన్ నంబర్‌తో వివరాలను పరిశీలించిన తర్వాతే పే మెంట్ చేయాలి. ఫేక్ ఫోన్ కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాం.