
డ్రైనేజీ నీటి మళ్లింపునకు చర్యలు చేపట్టండి
● ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశం
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్–సిరిసిల్ల ప్రధా న రహదారిపై కొత్తపల్లి మండలం బావుపేట వద్ద నెలకొన్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ప్రయాణం.. ప్రమాదకరం.. రోడ్డుపై నిలుస్తున్న మురుగు నీరు అనే శీర్షికన శనివారం సాక్షిలో ప్రచరితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. బావుపేటలోని రోడ్డుపై నిలిచిన డ్రైనేజీ నీటిని పరిశీలించారు. రహదారి విస్తరణలో భాగంగా నిర్మించిన డ్రైనేజీ మ్యాపును చూశారు.తాత్కాలికంగా నాలా ఏర్పాటు చేసి నిల్వ ఉన్న నీరు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ డీఈ, ఎంపీడీవోను ఆదేశించారు. శాశ్వత పరిష్కారం కోసం రూ.90లక్షలతో డ్రైనేజీ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపామని, త్వరలో పనులు చేపడతామని కలెక్టర్ తెలిపారు. రోడ్లు భవనాల శాఖ డీఈ కిరణ్, కొత్తపల్లి తహసీల్దార్ ఆర్.వెంకటలక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదేశాలతో..
కరీంనగర్–వేములవాడ ప్రధాన రహదారి బావుపేట వద్ద నిలిచిన డ్రైనేజీ నీటి మళ్లింపు తాత్కాలిక చర్యలు ప్రారంభమయ్యాయి. మురుగు నీటి మళ్లింపును వెంటనే చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించిన సందర్భంగా గ్రామస్తుల సహకారంతో కచ్చా కాల్వ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గతంలో కొంతమంది స్వార్థం కోసం అడ్డుకోగా.. ప్రస్తుతం వారిపై ప్రజలు, ప్రయాణికులు తిరగబడే సమ యం ఆసన్నమవడంతో తాత్కాలిక పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక మాజీ ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో కచ్చా కాలువ ద్వారా మురుగు నీటి మళ్లింపు చర్యలు చేపడుతున్నారు.

డ్రైనేజీ నీటి మళ్లింపునకు చర్యలు చేపట్టండి