
మాయమాటలు చెప్పి బంగారంతో ఉడాయించి
వీర్నపల్లి(సిరిసిల్ల): గుర్తుతెలియని బిచ్చగాడు మహిళకు మాయమాటలు చెప్పి బంగారం ఎత్తుకెళ్లిన ఘటన వీర్నపల్లి మండలం అడవిపదిరలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాలు. అడవిపదిరకు చెందిన చింతల్‌ఠాణం లక్ష్మి శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన ఓ బిచ్చగాడు వచ్చి.. నీ కొడుకుకు ప్రాణగండం ఉందని భయభ్రాంతులకు గురిచేశాడు. అంతేకాకుండా ఇంట్లో నుంచి బియ్యం తీసుకొచ్చి ఇస్తే మంచిగా చేస్తానని నమ్మబలికాడు. భయాందోళనకు గురైన లక్ష్మి కొంత బియ్యాన్ని తీసుకొచ్చి ఆ బిచ్చగాడు చేతిలో పెట్టింది. అంతలోనే ఏదో ఏదో రసాయనంతో కూడుకున్న బొట్టును ఆమె నుదుట పెట్టడంతో.. బిచ్చగాడు ఏం చెబితే అది చేసింది. తన కూతురు పావుతులం బంగారాన్ని ఆ బియ్యంలో వేయమని, గంట తర్వాత ఆ బియ్యానిచూడాలని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. కొంత సమయం తర్వాత అనుమానం వచ్చిన లక్ష్మి ఆ బియ్యంలో బంగారం కోసం వెతకగా దొరక్కపోవడంతో లబోదిబోమంటూ పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామాల్లో కొత్త వారు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.