
చివరి దశకు ఎంపిక పోటీలు
● జూలై 1 నుంచి హకీంపేట క్రీడాపాఠశాలలో రాష్ట్రస్థాయి పోటీలు
● ఎంపికై తే 4వతరగతిలో ప్రవేశం
కరీంనగర్‌స్పోర్ట్స్: రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడాపాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో 4వతరగతిలో ప్రవేశాలకు గాను ఎంపిక పోటీల ప్రక్రియ చివరి దశకు చేరుకున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 25, 26ల్లో జిల్లాస్థాయిలో ఎంపిక ప్రక్రియను ఆయా జిల్లా క్రీడాశాఖ అధికారులు పూర్తి చేశారు. జిల్లాస్థాయిలో రాణించిన విద్యార్థులను రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలకు ఎంపిక చేశారు. జూలై 1 నుంచి 5 వరకు హకీంపేటలోని క్రీడాపాఠశాలలో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లా విద్యార్థులకు జూలై 1, 2ల్లో ఎంపిక పోటీలు జరగనున్నాయి. సికింద్రాబాద్‌లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లో స్పోర్ట్స్ స్కూళ్లుండగా.. 2025–26 విద్యాసంవత్సరానికి గాను 4వతరగతిలో ప్రవేశం కల్పిస్తారు. మొత్తం 60 మంది బాలురు, 60 మంది బాలికలకు ప్రవేశం దక్కనుంది.
రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల వివరాలు
కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల విద్యార్థులు జూలై 1 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు రిపోర్టు చేయాలి. 2న ఆంత్రోపోమెట్రిక్, మోటార్ క్వాలిటీ, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. పెద్దపల్లి జిల్లా విద్యార్థులు జూన్ 30న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు రిపోర్టు చేయాలి. జూలై 1న ఆంత్రోపోమెట్రిక్, మోటార్ క్వాలిటీ, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయిలో విద్యార్థులకు నిర్వహించే ఆంత్రోపోమెట్రిక్ పరీక్షలు ఎత్తు, బరువు. రాష్ట్రస్థాయిలో విద్యార్థులకు నిర్వహించే మోటార్ క్వాలిటీ పరీక్షలు 30 మీటర్ల ప్లయియింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 6.10మీటర్ల షటిల్ రన్, స్టాండింగ్ వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ పరీక్ష, మెడిసన్ బాల్‌త్రో(కిలో), 800 మీటర్ల రన్నింగ్ మొత్తం 9 పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పరీక్షకు 3 పాయింట్లు మొత్తం 27 పాయింట్లుంటాయి. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా పాయింట్లిస్తారు. ఆధార్ కార్డు ఒరిజినల్, 4వతరగతి చదువుతున్నట్లు స్కూల్ వారిచ్చిన సర్టిఫికెట్, వయస్సు ధ్రువీకరణ పత్రం, 3వతరగతి ప్రొగ్రెస్ రిపోర్టు కార్డు, కమ్యూనిటీ సర్టిఫికెట్, 5 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు ఎంపికై న విద్యార్థులు తీసుకెళ్లాలి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండలం హకీంపేటలోని తెలంగాణ ప్రభుత్వ క్రీడాపాఠశాలలో రాష్ట్రస్థాయి క్రీడాపాఠశాల ఎంపిక పోటీలు జరుగుతాయి. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ పాఠశాలల్లో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు అవకాశం కల్పిస్తారు.