
డాక్టర్ భూంరెడ్డికి పద్మశ్రీ ఇవ్వాలి
కరీంనగర్: తెలంగాణలోనే మొట్టమొదటి జనరల్ సర్జన్, కరీంనగర్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు భూంరెడ్డికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌లో శుక్రవారం పర్యటించారు. ముందుగా జాగృతి నాయకులు జాడి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి బీసీ సంఘాల నాయకులు, జాగృతి సభ్యులను కలిశారు. డాక్టర్ భూంరెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గాండ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు జక్కం సంపత్ ఇటీవల మరణించగా ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. డాక్టర్ భూంరెడ్డి నివాసంలో ఆయన కుటుంబ సభ్యులు సూర్యనారాయణరెడ్డి, సుధ, రామ, రవీందర్‌రెడ్డితో మాట్లాడారు. దేశ మొదటి ప్రధాని నెహ్రూకు ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స చేసిన డాక్టర్ భూంరెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా వదులుకొని కరీంనగర్‌లో వైద్యసేవలు అందించారని గుర్తు చేశారు. ఆయనను పేదల డాక్టర్ అంటారని తెలిపారు. భూంరెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించుకోవాలన్నారు. జగిత్యాల మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్, జాగృతి నాయకులు జాడి శ్రీనివాస్, తానిపర్తి తిరుపతిరావు పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత