సీసీలు అంటేనే.. కలెక్టర్ల కళ్లలో కారం!
● కొత్తపల్లిలో ఓ భూమిని అప్పటి కలెక్టర్ కర్ణన్ డిజిటల్ సిగ్నేచర్ దుర్వినియోగం చేసి రూ.12 కోట్ల భూమి చేతులు మారేలా చేశారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఏకంగా కలెక్టర్‌కు తెలియకుండా జరిగిన ఈ విషయంపై ఒకరిద్దరు కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నా.. అసలు నిందితులపై ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. అప్పటి కలెక్టర్ సీసీని భూ రికార్డులు మార్చిన తహసీల్దార్ స్థానంలోకి పంపినా.. ఆయన రెండు వారాలకు మించి ఉండలేకపోయారు. వెంటనే తిరిగి కలెక్టరేట్‌లోని తన పాత సీసీ స్థానంలోకి వచ్చేశారంటే అర్థం చేసుకోవచ్చు.
● సర్ఫరాజ్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో కిసాన్‌నగర్‌లో కరీంనగర్‌కు చెందిన ఓ తహసీల్దార్ భూమిని మరో తహసీల్దార్ ఇతరుల పరం చేశాడు. అందులో ప్రస్తుతం కలెక్టరేట్‌లో సీసీలుగా ఉంటున్న ఇద్దరు తహసీల్దార్ ర్యాంకు ఆఫీసర్లు కీలకంగా ఉన్నారు. వీరిలో ఓ తహసీల్దార్ ఆరుగుంటలు భూమి, మరో తహసీల్దార్ మూడు గుంటల భూమి బహుమతి కింద పొందారు. ఈ విషయంపై విజిలెన్స్ విచారణ జరిపినా.. నివేదికను కలెక్టర్ సీసీ సాయంతో తొక్కిపెట్టారన్న విమర్శలున్నాయి.
● సదరు సీసీలు తమ ఇంట్లో వాళ్లకు కూడా స ర్కారు, కాంట్రాక్ట్ జాబులు పెట్టించుకోవడం విశేషం. ఎలాంటి పరీక్షలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి, కలెక్టర్ల కళ్లల్లో కారం కొడుతున్న వీరు.. ఏకంగా ఇపుడు కుటుంబ సభ్యులకు కూడా అడ్డదారిలో కొలువులు పెట్టించుకుంటున్న తీరు చూసి కలెక్టరేట్ సిబ్బంది విస్తుపోతున్నారు. ఒక సీసీ తన భార్యకు శాశ్వత ఉద్యోగం పెట్టించుకోగా, మరో ఇద్దరు సీసీలు కాంట్రాక్ట్ జాబ్ పెట్టించుకున్నారు. వీరి దందాకు ఉన్నతాధికారుల వద్ద కేవలం వీరు ప్రదర్శించే స్వామిభక్తి మాత్రమే పెట్టుబడి కావడం విశేషం.
● కలెక్టరేట్‌లో సీసీల విషయంలో వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని, రెండు దశాబ్దాలుగా సీసీలుగా కలెక్టరేట్‌లో పాతుకుపోయిన వారిని బదిలీ చేయాలని కోరు తూ జమ్మికుంటకు చెందిన ప్రముఖ సా మాజిక ఉద్యమకారు డు సిలివేరు శ్రీకాంత్ సోమవారం ప్రజవాణిలో ఫిర్యాదు చేశారు. ఆయన సాక్షితో మాట్లాడు తూ.. మంగళవారం సచివాలయంలో సీఎస్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●:
కరీంనగర్ కలెక్టరేట్‌లో సీసీల లీలలు తవ్వినా కొద్దీ వెలుగుచూస్తున్నాయి. కారుణ్య నియామకం కోటాలో చేరిన వీరు కలెక్టరేట్‌లో పాగా వేయడం కాదు, పాతుకుపోయారు. జిల్లాకు ఎంతమంది కలెక్టర్లు వచ్చినా వీరిని బదిలీ చేసే సాహసం ఏ ఐఏఎస్ అధికారి చేయకపోవడం గమనార్హం. వీరి మేనేజింగ్ స్కిల్స్ ముందు రాజకీయ నాయకులు కూడా దిగదిడుపంటే కలెక్టరేట్‌లో వీరి పాత్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పదోన్నతులు వచ్చినా, ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోవడానికి కారణాలు అవినీతి, అక్రమాలు. ఐఏఎస్‌లకు సీసీలుగా వ్యవహరిస్తూ.. వీరు జిల్లాను వీరి పిడికిల్లో బంధిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. వీరు తహసీల్దార్ ర్యాంకులో ఉండి.. సీసీలుగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతూ.. ఐఏఎస్‌ల కళ్లల్లో కారం కొడుతున్నారు. కనీసం ఆ అక్రమాలు బయటికి వస్తే..సదరు ఐఏఎస్ అధికారులు వీరిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నకు నేటికీ సమాధానం దొరకడం లేదు.
సీసీలపై ఇంటెలిజెన్స్ నివేదిక..
సాక్షిలో కలెక్టరేట్‌లో సీసీలు వారి అక్రమాలపై ప్రచురితమవుతున్న వరుస కథనాలపై ఇంతకాలం మొద్దునిద్ర పోయిన ఇంటెలిజెన్స్ విభాగం ఎట్టకేలకు కదిలింది. కలెక్టర్ పేషీలో ఎవరెవరు? గతంలో ఏయే అక్రమాలకు పాల్పడ్డారు? వాటిని కలెక్టర్లు చూడకుండా ఎవరు తొక్కిపెట్టారు? వీరిని బదిలీ కాకుండా ఆపడంలో కలెక్టర్ల పాత్ర ఎంతవరకు? అన్న విషయాలపై కూపీ లాగుతున్నారు. ఈసారి లభ్యమయ్యే ఆధారాలతో ఉన్నతాధికారులకు కరీంనగర్ కలెక్టరేట్ తతంగం గురించి వివరంగా నివేదిక రూపొందించనున్నారని సమాచారం.
కదలరు.. వదలరు
విలువైన భూముల రికార్డులు తారుమారు
కర్ణన్, సర్ఫరాజ్ సమయంలో రికార్డులు మార్చినా చర్యలేవి?
కారుణ్య నియామకాల్లో వచ్చి కలెక్టరేట్‌లో పాగా
స్వామిభక్తి ప్రదర్శించి భార్యలకు సర్కారు కొలువులు
సీసీలను బదిలీ చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు
సీసీలు అంటేనే.. కలెక్టర్ల కళ్లలో కారం!
సీసీలు అంటేనే.. కలెక్టర్ల కళ్లలో కారం!


