అడ్లూరి లక్ష్మణ్‌ అనే నేను.. | - | Sakshi
Sakshi News home page

అడ్లూరి లక్ష్మణ్‌ అనే నేను..

Jun 9 2025 12:08 AM | Updated on Jun 9 2025 12:10 AM

● ఉమ్మడి జిల్లాకు మరో మంత్రి పదవి ● అడ్లూరి లక్ష్మణ్‌ను వరించిన అవకాశం ● విధేయతకు దక్కిన ప్రాధాన్యం ● మూడుకు చేరిన మంత్రుల సంఖ్య ● పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో ముగ్గురు మంత్రులు ● కవ్వంపల్లికి విప్‌ ఇచ్చే అవకాశం

ధర్మపురికి అచ్చొచ్చిన మంత్రి పదవి

తెలంగాణ ఏర్పాటు నుంచి జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గానికి మంత్రివర్గంలో చోటు లభిస్తోంది. 2014లో గెలిచిన కొప్పుల చీఫ్‌విప్‌గా కేబినెట్‌ హోదా అందుకోగా, 2018లో సంక్షేమశాఖ మంత్రిగా వ్యవహరించారు. 2023లో గెలిచిన అడ్లూరి మొదట ప్రభుత్వ విప్‌గా, తాజాగా మంత్రిపదవి చేపట్టారు.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు మంత్రిపదవుల్లో పెద్దపీట దక్కింది. ఎన్న డూ లేని విధంగా ముగ్గురు మంత్రి పదవులను దక్కించుకోగా, గడ్డం వివేక్‌ సైతం ఉమ్మడి జిల్లాతో అనుబంధం కలిగి ఉన్నవారే. దీంతో మొత్తంగా రాష్ట్ర కేబినెట్‌లో జిల్లావాసులకు సముచిత స్థానం దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాలకు గానూ ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరవేయగా, దానికి తగ్గట్టుగా మంత్రి పదవులు దక్కాయనే కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లానుంచి ఇప్పటికే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ మంత్రులుగా కొనసాగుతుండగా, తాజాగా ధర్మపురి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అడ్లూరి లక్ష్మణ్‌ అదివారం రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గెలవగా, అందులో ముగ్గురికి మంత్రి పదవులు దక్కటంతో కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

అన్ని వర్గాలకు సమప్రాధాన్యం

కాంగ్రెస అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన తొలిమంత్రివర్గ విస్తరణలో బ్రహ్మణ సామాజికవర్గానికి చెందిన శ్రీధర్‌బాబు, బీసీగౌడ్‌ నుంచి పొన్నం ప్రభాకర్‌కు మంత్రి పదవులు దక్కాయి. మాదిగ సామాజికవర్గానికి చెందిన అడ్లూరి, ము న్నూరు కాపు అయిన ఆది శ్రీనివాస్‌లకు ప్రభుత్వ విప్‌లుగా అవకాశం కల్పించారు. ఆదివారం రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అడ్లూరికి మంత్రిపదవి లభించింది. మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చివరి నిమిషంలో కేబినెట్‌లో చోటు దక్కకపోయినా.. ప్రభుత్వ విప్‌ ఇచ్చే అవకా శాలున్నట్లు గాంధీభవన్‌ వర్గాలు చెప్పుతున్నాయి.

తొలిసారి ఎమ్మెల్యే.. కేబినెట్‌లోకి

సుదీర్ఘకాలంగా పార్టీలోనే కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు మంత్రి పదవిరావడం విధేయతకు పట్టం కట్టినట్లయింది. కార్మిక క్షేత్రమైన గోదావరిఖని నుంచి కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టిన అడ్లూరి ఎన్‌ఎస్‌యూలో స్టూడెంట్‌ లీడర్‌గా, యూత్‌ కాంగ్రెస్‌లో, జెడ్పీటీసీ, జెడ్పీచైర్మన్‌, కార్పొరేషన్‌ చైర్మన్‌, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడిగా వివిధ హాదాల్లో పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రభుత్వ విప్‌గా కొనసాగగా, తాజాగా కేబినెట్‌లో చోటు సంపాదించారు.

అడ్లూరి లక్ష్మణ్‌ నేపథ్యం

1982 నుంచి 85 వరకు గోదావరిఖని జూనియర్‌ కళాశాల ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా పని చేశారు. 1986 నుంచి 94 వరకు ఎన్‌ఎస్‌యూఐ కరీంనగర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుంచి 2001 వరకు ఏపీ యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 2006లో ధర్మారం (ఎస్సీ) రిజర్వుడ్‌ స్థానం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2010–12 వరకు కరీంనగర్‌ జెడ్పీ చైర్మన్‌గా పని చేశారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2013–14వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పని చేశారు. 2018లో జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ తన సమీప బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2023 డిసెంబర్‌ 15న ప్రభుత్వ విప్‌గా ప్రభుత్వం నియమించింది. తాజాగా ఆయనకు కేబినెట్‌లో బెర్త్‌ కల్పించింది.

అడ్లూరి లక్ష్మణ్‌ అనే నేను..1
1/1

అడ్లూరి లక్ష్మణ్‌ అనే నేను..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement