క్రీడా కార్యక్రమాలకు వెళ్తూ అనంతలోకాలకు..
కరీంనగర్‌స్పోర్ట్స్: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ కడారి రవి(57) మృతి చెందారు. హైదరాబాద్‌లో 1991 సంవత్సరానికి చెందిన వ్యాయామ వృత్తివిద్య (జీసీపీఈ) కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం, సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్ పోటీలకు హాజరయ్యేందుకు కారులో బయల్దేరాడు. కొమురవెల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు అయ్యాయి. సిద్దిపేట ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. రవికి భార్య, కుమారుడు ఉన్నారు. రవి ప్రస్తుతం కరీంనగర్‌లో నివాసం ఉంటూ.. పెద్దపల్లి జెడ్పీహెచ్‌ఎస్ (బాలుర) స్కూల్‌లో పనిచేస్తున్నాడు. అథ్లెటిక్స్, అర్చరీ, రైఫిల్ షూటింగ్ తదితర క్రీడలకు కోచ్‌గా, అథ్లెటిక్ క్రీడా సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు రిసోర్స్ పర్సన్‌గా సేవలందించారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల డీవైఎస్‌వోలు శ్రీనివాస్‌గౌడ్, సురేశ్, రాందాస్, రవి, క్రీడా సంఘాల బాధ్యులు సంతాపం వ్యక్తం చేశారు.
ఆత్మీయ సమ్మేళనంలో సంతాప సభ
హైదరాబాద్ దోమలగూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల(1991) పూర్వ విద్యార్థుల సమ్మేళనం దోమలగూడ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలలో ఆదివారం జరిగింది. సమ్మేళనానికి వెళ్తున్న కడారి రవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సమ్మేళనానికి హాజరైన 70మంది పైగా వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు.
కొమురవెల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం
ఫిజికల్ డైరెక్టర్ కడారి రవి మృతి


