
భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం
● ఈ చట్టం దేశంలోనే రోల్ మోడల్ ● అధికారులే నేరుగా ప్రజల వద్దకు
బుగ్గారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం రోల్‌మోడల్ అని, దేశంలోని 18రాష్ట్రాల్లో భూ చట్టాలపై అధ్యయనం చేసి ఈ చట్టాన్ని రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న జగిత్యాల జిల్లా బుగ్గారం ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు బల్గూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భూమి రిజిస్ట్రేషన్ అవగానే మ్యూటేషన్ తొందరగా అయ్యేలా చూడాలని, 30 రోజుల గడువుతో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. మరో రైతు గడ్డం భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా హమాలీలు లేక కాంటా సాగడం లేదని తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అన్ని సమస్యలకు భూభారతి చట్టంతో పరిష్కారం లభిస్తుందన్నారు. అన్నదమ్ముల మధ్య ఉన్న భూ సమస్యలకు మాత్రమే 30 రోజుల గడువు పడుతుందని, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. చట్టంలో అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. భూ సమస్యల పరిష్కారానికి వచ్చే వారికి అధికారులు అవసరమైన సూచనలు, సలహాలివ్వాలని సూచించారు. ఈనెల చివరి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామని అన్నారు. ధర్మపురికి ఆర్డీవో కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ.. గతంలో ఉన్న ధరణిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. అనంతరం చట్టం కింద పరిష్కరించిన పలు సమస్యలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీలను దరఖాస్తుదారులకు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎస్పీ అశోక్‌కుమార్, అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవో మధుసూదన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
డివైడర్‌ను ఢీకొన్న కారు
జగిత్యాలక్రైం: జగిత్యాల కలెక్టరేట్ ఎదుట శనివారం ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో నుజ్జునుజ్జయ్యింది. డివైడర్ కూలిపోయింది. జగిత్యాల విద్యానగర్‌కు చెందిన రవిబాబు కలెక్టరేట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను అతివేగంగా ఢీకొంది. కారు బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కారును అక్కడి నుంచి తొలగించారు.

భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం