
‘సుడా’కు స్థలం కేటాయింపు
● సిక్‌వాడీలో 847 చదరపు గజాలు అప్పగింత ● సొంత భవన నిర్మాణానికి సుడా సన్నాహాలు
కరీంనగర్ కార్పొరేషన్: శాతవాహన అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటి (సుడా)కి సొంత భవనం నిర్మాణం కాబోతుంది. నగరంలోని సిక్‌వాడీలో వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పక్కనున్న ప్రభుత్వ స్థలాన్ని సుడాకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సుడా కూడా ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ‘సుడా’ రూపుదాల్చుకున్నా సొంత భవనం అంటూ లేకుండా పోయింది. అప్పట్లో సుడా పాలకవర్గాన్ని నియమించిన తరువాత కూడా కొన్ని సంవత్సరాల వరకు కనీసం కార్యాలయాన్ని కూడా సమకూర్చలేదు. చివరకు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ భవన సముదాయంలోని ఓ భవనంలో అద్దె ప్రాతిపదికన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. నెలకు రూ.40 వేల చొప్పున అద్దెతో ప్రస్తుతం సుడా కార్యాలయం జెడ్పీసముదాయంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సుడా పాలకవర్గం కూడా మారిపోయింది. సొంత భవనం నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలంటూ ఇటీవల సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి స్వయంగా కలెక్టర్ పమేలా సత్పతికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన కలెక్టర్ సిక్‌వాడీలోని సర్వేనంబర్ 258లో 847 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థలాన్ని సుడా స్వాధీన పరుచుకుంది. ఆ స్థలంలో ఉన్న పురాతన భవనం శిథిలావస్థకు చేరడంతో ఇటీవలే కూల్చివేశారు. గతంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆ పాత భవనాన్ని వినియోగించేవాళ్లు. స్థలం కేటాయించడంతో,ఇక భవన నిర్మాణాన్ని చేపట్టేందుకు సుడా సన్నహాలు చేస్తోంది.