వరదకాలువలో పడి గీతకార్మికుడు మృతి | - | Sakshi
Sakshi News home page

వరదకాలువలో పడి గీతకార్మికుడు మృతి

May 9 2025 1:28 AM | Updated on May 9 2025 1:28 AM

వరదకాలువలో పడి గీతకార్మికుడు మృతి

వరదకాలువలో పడి గీతకార్మికుడు మృతి

మల్యాల: మండలంలోని సర్వాపూర్‌కు చెందిన గీత కార్మికుడు గుర్రం నాగమల్లు (50) ప్రమాదవశాత్తు వరదకాలువలో పడి మృతి చెందాడు. ఎస్సై నరేశ్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాగమల్లు వేములవాడలో ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం సర్వాపూర్‌లోని తల్లి వద్దకు వచ్చాడు. మంగళవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. నాగమల్లు కోసం గాలిస్తుండగా.. వరదకాలువలో శవమై తేలాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌ మధుసూదన్‌, సంపత్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు..

చొప్పదండి: మండలంలోని ఆర్నకొండ శివారు కమ్మర్‌ఖాన్‌పేట ఎక్స్‌రోడ్డు వద్ద గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ధర్మారం మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన కట్ట నవీన్‌ (32) మరణించాడు. ఎస్సై సురేందర్‌ కథనం ప్రకారం.. నవీన్‌కు అదే గ్రామానికి చెందిన కృష్ణవేణితో ఆరేళ్లకిత్రం వివాహమైంది. బుధవారం రాత్రి నవీన్‌ తన బామ్మర్ది మామిడి కార్తీక్‌, మరో యువకుడు కట్ట నాగరాజుతో కలిసి కరీంనగర్‌లో సినిమా చూసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. సినిమా సమయం మించిపోవడంతో తిరుగు పయనమయ్యారు. ఖమ్మర్‌ఖాన్‌పేట ఎక్స్‌రోడ్డు వద్ద కట్ట నవీన్‌ గుర్తు తెలియని వాహనాన్ని తప్పించబోయి కింద పడిపోయారు. బలమైన గాయాలు కావడంతో నవీన్‌ అక్కడికక్కడే చనిపోగా, కార్తీక్‌, నాగరాజులకు స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు 108వాహనంలో కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మృతుడి మామ మామిడి మల్లేశం ఫిర్యాదు మేకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఒకరి ఆత్మహత్య

చొప్పదండి: పట్టణానికి చెందిన ఉండాటి సతీశ్‌(30) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సురేందర్‌ తెలిపారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లక్కరం గ్రామానికి చెందిన సతీశ్‌కు చొప్పదండిలోని మానుపాటి కనుకయ్య కూతురు కళను ఇచ్చి పదమూడేళ్ల క్రితం వివాహం చేశారు. వీరు చొప్పదండిలోనే నివాసం ఉంటూ కూలీపని చేసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం దంపతులకు గొడవలు రాగా పంచాయితీలు జరిగాయి. అత్తగారి ఊరికి రానని, కళ చెప్పడంతో చొప్పదండిలోనే ఉంటున్నారు. ఇటీవల శ్రీరామనవమికి కుటుంబసభ్యులంతా వేములవాడకు వెళ్లగా.. అక్కడా గొడవ జరిగింది. తాజాగా లక్కారం వెళ్తానని సతీశ్‌ చెప్పడంతో రూ.లక్ష అప్పు ఉందని అడ్డుకున్నారు. దీంతో లక్కారంలోని తల్లికి సతీశ్‌ ఫోన్‌ చేసి భార్య కళ, మామ కనుకయ్య, అత్త రాజమ్మ, మరుదళ్లు సార్ల అంజలి, లోకిని శారదలు తనను వేధిస్తున్నాడని వాపోయాడు. జీవితంపై విరక్తి చెంది గురువారం ఉదయం ఇంట్లో చీరతో ఉరివేసుకున్నాడు. భార్య గమనించి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా.. అప్పటికే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఉండాటి సాయిలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement