
ఆధ్యాత్మిక క్షేత్రం.. శ్రీమానసాదేవి ఆలయం
గన్నేరువరం: మండలంలోని ఖాసీంపేటలో ఉద్భవించిన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీమానసాదేవి ఆలయం సప్తమ వార్షికోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ ఆలయం దక్షిణభారతదేశంలో మొదటిదిగా ప్రసిద్ధి చెందింది. 108 శక్తి పీఠాల్లో 6వ శక్తిపీఠం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామానికి వెళ్లే రహదారిలో కరీంనగర్–సిద్దిపేట జిల్లాల సరిహద్దులోని బద్దం చిన్న నర్సింహారెడ్డి వ్యవసాయ పొలంలో 2015 జూన్‌లో అమ్మవారి విగ్రహం వెలిసింది. గ్రామస్తులు భూ యజమానితో కలిసి తాత్కాలికంగా ఆలయాన్ని ఏర్పాటు చేసి అర్చకుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అప్పటినుంచి పూజలందుకుంటున్న మానసాదేవి అమ్మవారికి 2018లో ఆలయాన్ని పూర్తి చేసి అదే ఏడాది ఏప్రిల్ 26 నుంచి 29 వరకు విగ్రహ ప్రతిష్టామహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. 108 శివలింగ నాగ ప్రతిమల ధర్మగుండం, 12 ఫీట్ల భారీ ఆంజనేయ స్వామి ఏకశిల విగ్రహం, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ఆలయానికి భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నారు. ఇక్కడ ప్రతి మంగళ, శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
54 కిలోలతో ప్రత్యేక అభిషేకాలు
మూడు రోజులపాటు జరిగే ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 8న 54 కిలోల పసుపుతో అమ్మవారికి హరిద్రా అభిషేకం, 54 కిలోల కుంకుమతో అపురూప లక్ష్మీకి కుంకుమాభిషేకం నిర్వహించనున్నారు.
నేటి నుంచి సప్తమ వార్షికోత్సవం
మూడు జిల్లాల సరిహద్దుల్లో ఆలయం
దక్షిణ భారతదేశంలోనే మొదటిది
మూడురోజుల పాటు వివిధ కార్యక్రమాలు
ఏర్పాట్లు పూర్తి
శ్రీమానసాదేవి సప్తమ వార్షికోత్సవానికి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది, కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి నుంచి గుండ్లపల్లి మీదుగా, వెంకట్రావుపల్లి, పొత్తూరు మీదుగా బస్సు సౌకర్యం ఉంది.
– ఏలేటి చంద్రారెడ్డి, మానసాదేవి ఆలయ చైర్మన్
మూడు రోజులు వేడుకలు
అమ్మవారి ఆలయ సప్తమ వార్షికోత్సవాలు ఈనెల 8 నుంచి పదో తేదీ వరకు జరుగుతాయి. ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, మానసాదేవి లక్ష్మీపుష్పార్చన కార్యక్రమాలు ఉంటాయి. భక్తులకు ప్రతిరోజు అన్నప్రసాదం, తీర్థప్రసాద వితరణ ఉంటుంది.
– పెండ్యాల అమర్నాథ్ శర్మ,
ఆలయ ప్రధాన అర్చకులు

ఆధ్యాత్మిక క్షేత్రం.. శ్రీమానసాదేవి ఆలయం

ఆధ్యాత్మిక క్షేత్రం.. శ్రీమానసాదేవి ఆలయం

ఆధ్యాత్మిక క్షేత్రం.. శ్రీమానసాదేవి ఆలయం