
ముటేషన్ మార్చాలని ఆందోళన
జగిత్యాల: ముగ్గురు సంతానంలో ఒకరికే ఇంటిని ముటేషన్ చేయడంతో మిగతా ఇద్దరు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. వివరాలు.. జగిత్యాల పట్టణానికి చెందిన అప్సర్ బేగం, మహ్మద్‌ఖాన్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. అప్సర్‌బేగం మరణించిన అనంతరం మహ్మద్‌ఖాన్ ముగ్గురు కూతుళ్లలో ఒక కూతురుకు తన ఇంటిని ముటేషన్ చేశాడు. మిగతా ఇద్దరికి చేయకపోవడంతో మంగళవారం కూతుళ్లతో పాటు అల్లుళ్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఒకరికే ముటేషన్ ఎలా చేస్తారని, తమకు కూడా చేయాలని కూతుళ్లు, అల్లుళ్లు ఆందోళన చేపట్టడంతో పాటు, అందులో అల్లుడు జఫరోద్దీన్ కార్యాలయ గోడకు తల బాదుకోవడంతో తీవ్రగాయమైంది. వెంటనే 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈవిషయమై మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ, మహ్మద్‌ఖాన్ వారి కూతుళ్లలో ఒక కూతురుకే ఇల్లు ముటేషన్ చేశారని, తమ సమస్య కాదని, అది వారి కుటుంబ సమస్య అని పేర్కొన్నారు.